Mobile Popup Ad
Mobile Popup Ad

బాసర ఆలయ పునర్నిర్మాణ పనులకు శ్రీకారం.. రూ. 354 కోట్లతో మాస్టర్ ప్లాన్

కలం, నిర్మల్: దక్షిణ భారతదేశంలో ఏకైక సరస్వతి క్షేత్రంగా ప్రసిద్ధి చెందిన బాసర శ్రీ జ్ఞాన సరస్వతి అమ్మవారి ఆలయం (Basara Temple) లో చారిత్రాత్మక ఘట్టానికి ఆదివారం తెరలేచింది. దశాబ్దాలుగా ఎదురుచూస్తున్న ఆలయ పునర్నిర్మాణ పనులు వైభవంగా ప్రారంభమయ్యాయి. ఇందుకోసం అమ్మవారి మూలవిరాట్టును ఆగమశాస్త్ర నియమాలకు అనుగుణంగా బాలాలయంలో ప్రతిష్ఠించి, ప్రధాన ఆలయ పునర్నిర్మాణ కార్యక్రమాలకు శ్రీకారం చుట్టారు.

రాష్ట్ర ప్రభుత్వం రూ.354 కోట్ల వ్యయంతో రూపొందించిన సమగ్ర మాస్టర్ ప్లాన్ ప్రకారం ఆలయాన్ని తిరుమల తరహాలో ఆధునిక సౌకర్యాలతో అభివృద్ధి చేయనున్నారు. ఆలయ ప్రధాన గర్భగుడి, మహామండపం, ప్రాకారాలు, యాత్రికుల సౌకర్యాలు, క్యూ కాంప్లెక్స్, పార్కింగ్, అన్నదాన భవనం తదితర నిర్మాణాలతో బాసర క్షేత్రానికి సరికొత్త వైభవం తీసుకురానున్నారు. ఈ మహత్తర పునర్నిర్మాణంలో భాగంగా హైదరాబాదుకు చెందిన దాతలు పద్మప్రియ–సునంద దంపతులు గర్భగుడి, మహామండప నిర్మాణానికి రూ.31 కోట్ల విరాళం అందించారు.

పునర్నిర్మాణ పనుల ప్రారంభోత్సవంలో వారు ప్రత్యేక పూజలు నిర్వహించి అమ్మవారి ఆశీస్సులు పొందారు. ఈ కార్యక్రమంలో ముధోల్ ఎమ్మెల్యే పవార్ రామారావు పటేల్ పాల్గొని పునర్నిర్మాణ పనులను అధికారికంగా ప్రారంభించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. బాసర అమ్మవారి ఆలయ పునర్నిర్మాణం తన రాజకీయ జీవితంలో మరపురాని ఘట్టమని అన్నారు. ఎన్నో ఏళ్ల తర్వాత ఆలయానికి మహర్దశ పట్టిందని, ఈ మహాకార్యంలో భాగస్వామి కావడం అదృష్టంగా భావిస్తున్నానని చెప్పారు.

ఆలయ అభివృద్ధికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రత్యేక చొరవ తీసుకుని రూ.354 కోట్ల నిధులు మంజూరు చేయడం అభినందనీయమని ఎమ్మెల్యే పేర్కొన్నారు. పునర్నిర్మాణం పూర్తయిన అనంతరం బాసర దేశవ్యాప్తంగా ప్రముఖ ఆధ్యాత్మిక, పర్యాటక కేంద్రంగా మరింత ఖ్యాతి పొందుతుందని, భక్తులకు అన్ని వసతులు అందుబాటులోకి వస్తాయని ఆశాభావం వ్యక్తం చేశారు.

పునర్నిర్మాణ పనుల నేపథ్యంలో ప్రధాన ఆలయంలో దర్శనాలను తాత్కాలికంగా నిలిపివేసి, ఇక నుంచి భక్తులకు బాలాలయంలోనే అమ్మవారి దర్శనం కల్పించనున్నారు. ఆగమశాస్త్ర పద్ధతుల ప్రకారం నిత్యపూజలు, ప్రత్యేక సేవలు బాలాలయంలోనే కొనసాగుతాయని ఆలయ అధికారులు తెలిపారు. పునర్నిర్మాణ ప్రారంభోత్సవ కార్యక్రమంలో ఆలయ ఈవో అంజనీదేవి, అర్చకులు, అధికారులు, ప్రజాప్రతినిధులు, పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొని అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>