కలం, కరీంనగర్ బ్యూరో: కరీంనగర్ (Karimnagar) జిల్లా కేంద్రంలోని ఆర్టీసీ వర్క్ షాప్ క్వార్టర్స్ ప్రాంతంలోని హిందూ పురి ప్రాంతం 12 ఏళ్లుగా తీవ్ర నిర్లక్ష్యానికి గురవుతోంది. నాలుగు డివిజన్లకు సంబంధించి చెత్తాచెదారాన్ని ఇక్కడే వేస్తుండటంతో, ఈ ప్రాంతం డంపింగ్ యార్డ్‌గా మారిపోయింది. స్థానిక ప్రజలు దుర్గంధం, దోమల బెడదతో నరకయాతన అనుభవిస్తున్నారు. ఎట్టకేలకు 22వ డివిజన్ బీజేపీ కార్పొరేటర్ బండ రమణారెడ్డి రంగంలోకి దిగారు. నగర మేయర్ కొలగాని శ్రీనివాస్ దృష్టికి ఈ సమస్యను తీసుకెళ్లడంతో వెంటనే స్పందించారు. తక్షణం చెత్త తొలగింపు పనులు చేపట్టాలని మున్సిపల్ సిబ్బందిని ఆదేశించారు. ఇక నుంచి ఇక్కడ చెత్తను వేయకుండా మున్సిపల్ అధికారులు శాశ్వత చర్యలు చేపట్టాలని స్థానిక ప్రజలు డిమాండ్ చేస్తున్నారు. చెత్తను తరలించడానికి చర్యలు తీసుకున్న మేయర్ కొలగాని శ్రీనివాస్, కార్పొరేటర్ బండ రమణారెడ్డి స్థానికులు ధన్యవాదాలు తెలిపారు.

