శ్రీరామ నవమికి భద్రాచలం సిద్ధం.. క్షేత్ర విశేషాలు ఇవే..

కలం, ఖమ్మం బ్యూరో : తెలంగాణ రాష్ట్రంలోని భద్రాచలం (Bhadrachalam) దక్షిణ అయోధ్యగా పేరుపొందిన దివ్య క్షేత్రం. సాక్షాత్తూ వైకుంఠ రాముడు కొలువు తీరిన ఈ క్షేత్రం గురించి బ్రహ్మ పురాణంలోనూ వివరించబడింది.

భద్రాచలం (Bhadrachalam) క్షేత్ర విశేషాలు ..

భద్రగిరి చరిత్ర ప్రారంభం అయింది రామాయణ కాలంలోనే.. ఆ కాలంలో ఈ ప్రాంతమంతా దండకారణ్యం. వనవాసం సమయంలో సీతా రాముడు ఇక్కడ గడిపాడని చెబుతారు. బంగారు లేడిని చూడటం, మారీచ వధ, రావణుడు సీతను ఎత్తుకుపోవటం అన్నీ ఇక్కడికి కొంచెం దూరంలో ఉన్న పర్ణశాలలో జరిగాయని ప్రతీతి. శ్రీ రాముడు రామావతారం ముగిసిన తర్వాత యుగాల తరబడి తపస్సు చేస్తున్న తన భక్తుడు భద్రుడు కోసం ఈ ప్రదేశంలో వెలిశాడు. రాముడు అవతారం ముగిసి వైకుంఠం చేరిన చాలాకాలం తర్వాత శ్రీ మహా విష్ణువు భక్తునికిచ్చిన మాటకోసం మళ్ళీ వైకుంఠంనుంచి రామావతారంలో వచ్చి ఇక్కడ వెలిశాడుకనుక ఈ రాముణ్ణి వైకుంఠ రాముడంటారు. దానికి సంబంధించిన కధ ఏమిటంటే…

మేరు పర్వత పుత్రుడైన భద్రుడు, రాముడు తనపై నివాసం ఏర్పరచుకోవాలని తపస్సు చేశాడు. ఆ సమయంలో రాముడు సీతని కోల్పోయి ఆవిడకోసం వెతుకుతూ వుంటాడు. అందుకని సీతని (Seetha) తీసుకువచ్చిన తర్వాత భద్రుని కోరిక తీరుస్తానని మాట ఇచ్చి సీతాన్వేషణ కోసం వెళ్తాడు. భద్రుడు తన తపస్సు కొనసాగిస్తాడు. కానీ రాముడు ఈ విషయం మరచిపోతాడు. తర్వాత అవతార పరిసమాప్తికూడా అవుతుంది.

భద్రుడు మాత్రం తన తపస్సు తీవ్రం చేయడంతో తపస్సు శక్తికి వైకుంఠవాసుడికి భద్రుడి కోరిక గుర్తు వచ్చి గజేంద్రమోక్షంలో వలె హడావిడిగా బయల్దేరాడు. విష్ణు మూర్తి అలవాటు ప్రకారం శంఖు చక్రాలు తీసుకున్నాడు గానీ తొందరలో అవి తారుమారయినాయి. కుడిచేతిలో వుండవలసిన సుదర్శన చక్రం ఎడమ చేతికి, ఎడమ చేతిలో వుండవలసిన శంఖు కుడి చేతికి మారాయి. భక్తుడు కోరుకున్నది రామావతారం గనుక విల్లంబులు తీసుకున్నాడు. (రాముడికి రెండు చేతులే .. కానీ వైకుంఠవాసుడు చతుర్భుజుడు). శ్రీ లక్ష్మి సీతగా, శేషుడు లక్ష్మణుడుగా వెంటరాగా భద్రుడి ముందు ప్రత్యక్షమయ్యాడు.

చతుర్భుజాలలో శంఖ, చక్ర విల్లంబులతో, సీతా లక్ష్మణ సమేతంగా తనముందు సాక్షాత్కరించిన శ్రీరామచంద్రుని చూసి భద్రుడు పరవశుడై అనేక విధాల ప్రార్థించాడు. స్వామి భద్రుడిని వరం కోరుకొనమనగా, నీ సాక్షాత్కారముకంటే ఇంకేమి వరం కావాలి, అయినా కోరుకొమ్మన్నావుగనుక.. దర్శనమిచ్చిన విధంగానే శిరస్సుపై సదా నివసించమని కోరాడు భద్రుడు. రామచంద్రుడు కూడా పంచ భూతములున్నంత కాలం భద్రునిపై తాను సీతా, లక్ష్మణ సమేతంగా విలసిల్లుతానని, తనతో కూడా భద్రుని దర్శించినవారికి సమస్త శుభములు కలుగుతాయని వరమిచ్చాడు రాముడు. ఆ విధంగా శ్రీరామచంద్రుడు భద్రుని శిరస్సుపై స్ధిర నివాసమేర్పరచుకుని రామ భద్రుడయ్యాడు, సాక్షాత్తూ జగత్పాలకుని తనపై మోస్తూ భద్రుడు భద్రాచలమయ్యాడు.

చరిత్రకందిన కథనం ప్రకారం …

17వ శతాబ్దంలో భద్రాచలం సమీపంలోని భద్రిరెడ్డిపాలెం నివాసి అయిన పోకల దమ్మక్క కలలో శ్రీరాముడు (Sri Ram) కనిపించి తాను భద్రగిరిమీద వున్నానని, తన మూర్తులను.. దేవతలు, ఋషులు పూజిస్తున్నారని, ఆవిడని ఆ విగ్రహాలు కనుగొని పూజించమని చెబుతాడు. మర్నాడు ఉదయం ఆవిడ అంతా వెతికి చివరికి ఒక పుట్టలో విగ్రహాలు కనుగొన్నది. గోదావరి నీటితో పుట్ట కరిగించింది. విగ్రహాలకు రోజూ పూజలు చేసి అడవిలో రాలిన పళ్ళు నైవేద్యం పెట్టింది. ఊరివారి సాయంతో స్వామికి నీడకోసం ఆకులతో పందిరి వేసింది. శ్రీరాముడు ఆమెతో తన భక్తుడు ఒకరు తనకు గుడికట్టిస్తారని చెప్పాడు. ఆ గుడికట్టించే భక్తుడికోసం దమ్మక్క ఓపిగ్గా వేచి చూసింది.

క్రీ.శ. 1674 లో కంచర్ల గోపన్న అనే తాహసీల్దారు ఈ మందిర నిర్మాణానికి పూనుకున్నాడు. ఆయనే తర్వాత భక్త రామదాసుగా ప్రసిద్ధికెక్కాడు. గోపన్న మేనమామ అక్కన్న గోల్కొండ ప్రభువు తానీషా దగ్గర మంత్రిగా వుండేవాడు. ఆయన తానీషాతో (Thanisha) చెప్పి మేనల్లుడికి తహసీల్దారుగా ఉద్యోగం ఇప్పించాడు. పాల్వంచ తహసీల్దారుగా పని చేస్తున్న గోపన్న ఒకసారి భద్రాచలంలో (Bhadrachalam) జరిగే తిరణాలకి ఆ ప్రాంతంవారు వెళ్ళటం చూసి వారితో వెళ్ళాడు. పందిరి కింద వున్న రాముడిని చూసి గుడి కట్టించాలనే తపనతో గ్రామస్తుల దగ్గర చందాలు వసూలు చేస్తాడు. అవి సరిపోక శిస్తుకింద వసూలు చేసిన ఆరు లక్షల రొక్కం తానీషా అనుమతి లేకుండా ఆలయ నిర్మాణానికి ఖర్చు పెడతాడు.

రామదాసుగా మారిన గోపన్న

ఆలయం పూర్తికావస్తున్న సమయంలో గోపురంమీద ప్రతిష్టించవలసిన సుదర్శన చక్రం విషయంలో కూడా అవరోధాలెదురవుతాయి. అదే రాత్రి శ్రీరాముడు గోపన్నకి కలలోకి వచ్చి.. మరునాడు గోదావరిలో స్నానం చేస్తున్న సమయంలో చక్రం కనబడుతుందని చెబుతాడు. అలాగే మర్నాడు గోపన్న నదిలో స్నానం చేసే సమయంలో సుదర్శన చక్రం దొరుకుతుంది. భగవద్దత్తమయిన ఆ చక్రాన్నే ఆలయ గోపురంపై వుంచి ఆలయ నిర్మాణం పూర్తి చేశారు. అప్పటినుంచి గోపన్న కష్టాలపాలయ్యాడు. శిస్తు డబ్బు చెల్లించలేదనే నేరం మీద తానీషా గోపన్నని గోల్కొండలోని చెరసాలలో పెట్టి క్రూర హింసలు పెట్టాడు. 12 సంవత్సరాలు ఆ బందిఖానాలో నానా బాధలు పడ్డ గోపన్న ఆ బాధలు తట్టుకోలేక శ్రీరాముడితో మొర పెట్టుకుంటూ, అర్థిస్తూ, కోపగించుకుంటూ అనేక కీర్తనలు, దాశరధీ శతకం రాశాడు. అవి ఇప్పటికీ ప్రజలు భక్తితో పాడుకుంటున్నారు. గోపన్న రామునిపట్ల చూపించిన భక్తివల్ల రామదాసుగా పేరు పొందాడు.

తానీషా చాలా అదృష్టవంతుడు. గుడి కట్టించినా గోపన్నకు దొరకని రామ దర్శనం తానీషాకు దొరికింది. రామ లక్ష్మణులు తానీషా దగ్గరకు రామోజీ, లక్ష్మోజీ పేర్లతో గోపన్న సేవకులుగా వెళ్ళి ఆయన చెల్లించవలసిన సుంకం డబ్బు చెల్లిస్తారు. తానీషా వారికి రశీదు కూడా ఇస్తాడు. వారు దానిని గోపన్న తల దగ్గర పెట్టి మాయమవుతారు. మర్నాడు తానీషా గోపన్నను చెర విడిపించి విషయమంతా తెలుసుకుని, రామోజీ లక్ష్మోజీ కట్టిన శిస్తు డబ్బు ఆరు లక్షల మొహరీలు కూడా గోపన్నకు ఇస్తాడు. కానీ రామదాసు వాటిని స్వీకరించక, శ్రీరాముని గుర్తుగా రెండు మొహరీలు మాత్రం తీసుకుంటాడు. అవి ఇప్పటికీ ఆలయంలో వున్నాయి.

తానిషా ఆలయ నిర్వహణ బాధ్యత వహించటమేగాక పాల్వంచ పరగణానుంచి వచ్చే సొమ్ము దేవాలయానికి చెందేటట్లు శాసనం చేశాడు. అంతేకాదు స్వామివారి కళ్యాణానికి ఏనుగుమీద ప్రత్యేక అధికారితో ముత్యాల తలంబ్రాలు పంపించసాగాడు. ఆ ఆనవాయితీ నేటికీ సాగుతోంది. స్వామివారి కళ్యాణానికి రాష్ట్ర ప్రభుత్వం తరఫున పట్టుబట్టలు, ముత్యాల తలంబ్రాలు తీసుకువస్తున్నారు. తర్వాత పాల్వంచ తహసీల్దారుగా గుంటూరునుంచి తూము నరసింహదాసు వచ్చాడు. ఆలయ నిర్వహణ బాధ్యతకూడా వహించిన ఆయన ఆలయంలోని రెండు స్తంబాలమీద ఉదయం సుప్రభాతం నుంచి రాత్రి పవళింపు సేవదాకా ఆలయంలో స్వామికి జరగవలసిన సేవల గురించి చెక్కించాడు. వాటి ప్రకారమే నేటికీ అన్ని పూజలూ జరుగుతున్నాయి.

చూడవలసిన ప్రదేశాలు..

భద్రాచలం (Bhadrachalam) నుంచి 35 కి.మీ.ల దూరంలో ఉన్న పర్ణశాల ప్రాంతంలోనే సీతారామ లక్ష్మణులు వనవాసం సమయంలో పర్ణకుటీరం నిర్మించుకుని వున్నారనీ, బంగారు లేడి, సీతాపహరణ ఇక్కడే జరిగాయని అంటారు. వాటి గుర్తుగా ఏర్పాటు చేసిన విగ్రహాలు ఆకర్షణీయంగా కనిపిస్తాయి. సీతామ్మవారు నార చీరెలు ఆరేసుకుంటే బండమీద పడ్డ చారలని చూపిస్తారు. ఆవిడ వాడిన పసుపు కుంకుమల రాళ్ళు అని కూడా చూపిస్తారు. ఇవీ, ఇంకా కొన్ని ప్రదేశాలు ఆటోలో వెళ్ళి చూసి రావచ్చు.

పాపికొండలు..

గోదావరి నదిలో ఒక రోజు పాపికొండలు విహారయాత్ర చేసిరావచ్చు. మధ్యలో పేరంటాలపల్లి దగ్గర ఆపుతారు. ఇక్కడ ప్రస్తుతం గిరిజనులచే నిర్వహింపబడుతున్న చిన్న శివాలయం వున్నది. ఇక్కడ పూజారి వుండరు. ఎవరికివారే పూజ చేసుకోవచ్చు. లాంచీవారే మధ్యాహ్న భోజనం ఏర్పాటు చేస్తారు. లాంచీలు బయల్దేరే ప్రదేశానికి ఆటోలలో వెళ్లాల్సి ఉంటుంది.

సీతారామ కళ్యాణ ఏర్పాట్లపై మంత్రి సమీక్ష..

రాముడి కళ్యాణానికి దేశ విదేశాల నుంచి భక్తులు అధికంగా వచ్చే అవకాశం ఉన్నందున ఎలాంటి లోటుపాట్లు లేకుండా అన్ని సౌకర్యాలు కల్పించాలని మంత్రి తుమ్మల అధికారులను ఆదేశించారు. గురువారం భద్రాచలంలోని (Bhadrachalam) మిథిలా స్టేడియంలో నిర్వహించనున్న శ్రీ సీతారామచంద్ర స్వామి వారి కల్యాణం, మహా పట్టాభిషేకం ఏర్పాట్లను పరిశీలించిన అనంతరం మంత్రి మాట్లాడుతూ, రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రభుత్వం తరఫున పట్టు వస్త్రాలు, ముత్యాల తలంబ్రాలు సమర్పించేందుకు విచ్చేయనున్నారని తెలిపారు. ఈ సందర్భంగా జిల్లా యంత్రాంగం సమన్వయంతో ప్రతి శాఖ తమ బాధ్యతలను సమర్థవంతంగా నిర్వర్తించాలని, వీఐపీలు, వివిఐపీలు, భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా మర్యాదపూర్వకంగా సేవలు అందించాలని మంత్రి ఆదేశించారు.

Read Also: నవరాత్రి వేళ సుందరకాండ పఠనంతో శుభఫలితాలు

Follow Us On: X(Twitter)

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>