కరీంనగర్ వైద్య శాఖలో డిజెబిలిటీ సర్టిఫికెట్ల వివాదం

కలం, కరీంనగర్ బ్యూరో: వైద్య ఆరోగ్య శాఖతో పాటు అనుబంధ విభాగాలలో పనిచేస్తున్న కొంతమంది ఉద్యోగులు నిబంధనలకు విరుద్ధంగా వికలాంగుల ధ్రువీకరణ పత్రాలు (Disability Certificates) పొందుతూ ప్రభుత్వ ప్రయోజనాలు పొందుతున్నారనే ఆరోపణలు కలకలం రేపుతున్నాయి. ఉమ్మడి కరీంనగర్ (Karimnagar) జిల్లా పరిధిలోని వైద్య ఆరోగ్య శాఖ, వైద్య ఆరోగ్య సంచాలకుల కార్యాలయం, వైద్య విద్యా సంచాలకుల కార్యాలయాల పరిధిలో పనిచేస్తున్న పలువురు ఉద్యోగులపై ఈ తరహా ఆరోపణలు వినిపిస్తున్నాయి. 10 శాతం వైకల్యం కూడా లేని కొంతమందికి 50 నుంచి 80 శాతం వరకు వైకల్యం ఉన్నట్లు ధ్రువీకరణ పత్రాలు జారీ అయ్యాయనే ఆరోపణలు ఉన్నాయి. అయితే ఈ ఆరోపణలకు సంబంధించి అధికారిక విచారణలో వాస్తవాలు తేలాల్సి ఉంది. సాధారణ ప్రజలు సదరం సర్టిఫికెట్ కోసం దరఖాస్తు చేసుకుంటే నెలల తరబడి తిరగాల్సి వస్తోందని, అర్హత ఉన్నప్పటికీ సర్టిఫికెట్లు పొందడం కష్టంగా మారిందని పలువురు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

సాధారణ పౌరులకు కష్టాలు.. ఉద్యోగులకు సులువా?

దివ్యాంగుల ధ్రువీకరణ పత్రం కోసం సాధారణ పౌరులు అనేక వైద్య పరీక్షలు, వివిధ దశల పరిశీలనలను ఎదుర్కోవాల్సి వస్తోందని బాధితులు చెబుతున్నారు. అదే సమయంలో వైద్య ఆరోగ్య శాఖలో పనిచేస్తున్న కొంతమంది ఉద్యోగులకు అధిక శాతం వైకల్యం ఉన్నట్లు సర్టిఫికెట్లు సులభంగా ఎలా లభిస్తున్నాయనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి. ఉద్యోగులకు, సాధారణ ప్రజలకు వేర్వేరు ప్రమాణాలు వర్తిస్తున్నాయా? సర్టిఫికెట్ల జారీ ప్రక్రియలో ఏమైనా అక్రమాలు జరిగాయా? అనే అంశాలపై సమగ్ర విచారణ జరపాలని ఉద్యోగ సంఘాలు, ప్రజలు కోరుతున్నారు.

తాత్కాలిక గాయాలకు శాశ్వత సర్టిఫికెట్లా?

ప్రమాదాలలో కాళ్లు, చేతులు విరగడం లేదా ఇతర గాయాల కారణంగా తాత్కాలిక వైకల్యం ఏర్పడిన సందర్భాల్లో కొంతమందికి తాత్కాలిక ధ్రువీకరణ పత్రాలు జారీ చేసే అవకాశం ఉంటుంది. అయితే ఇలాంటి తాత్కాలిక వైకల్యాలను శాశ్వత వైకల్యంగా చూపించి ‘పర్మినెంట్ డిజెబిలిటీ’ సర్టిఫికెట్లు పొందినట్లు కొంతమంది ఉద్యోగులపై ఆరోపణలు వినిపిస్తున్నాయి. వైకల్యం శాశ్వతమా, తాత్కాలికమా? వైకల్యం శాతం ఎంత? అనే అంశాలను సంబంధిత వైద్య రికార్డులు, పరీక్షలు, మెడికల్ బోర్డు నివేదికల ఆధారంగా నిర్ధారించాల్సిన అవసరం ఉందని పలువురు పేర్కొంటున్నారు.

సదరం ద్వారా రీ-టెస్టింగ్‌కు డిమాండ్

వైద్య ఆరోగ్య శాఖ, వైద్య ఆరోగ్య సంచాలకుల కార్యాలయం, వైద్య విద్యా సంచాలకుల కార్యాలయాల పరిధిలో వికలాంగుల కోటా కింద ప్రభుత్వ ప్రయోజనాలు పొందుతున్న ఉద్యోగుల సర్టిఫికెట్లను సమీక్షించాలని డిమాండ్లు వెల్లువెత్తుతున్నాయి. ప్రతి ఉద్యోగికి సదరం ద్వారా పునఃపరిశీలన వైద్య పరీక్షలు నిర్వహించాలని ఉద్యోగ సంఘాలు, పౌరులు కోరుతున్నారు. రీ-టెస్టింగ్‌లో ఎవరైనా అనర్హులుగా తేలితే, నిబంధనల ప్రకారం వారు ఇప్పటివరకు పొందిన ఆర్థిక ప్రయోజనాలు, అలవెన్సులు, ఆదాయపు పన్ను మినహాయింపులు తదితర ప్రయోజనాలపై సమీక్ష జరిపి అవసరమైన రికవరీ చర్యలు చేపట్టాలని కోరుతున్నారు. అలాగే అనర్హత ఆధారంగా పొందిన ప్రమోషన్లు, బదిలీలు, రిజర్వేషన్ ప్రయోజనాలపై కూడా పునఃసమీక్ష చేయాలని డిమాండ్ చేస్తున్నారు.

సర్టిఫికెట్లు జారీ చేసిన వైద్యుల పాత్రపై విచారణ

వికలాంగుల ధ్రువీకరణ పత్రాలు జారీ చేసిన మెడికల్ బోర్డులు, సంబంధిత వైద్యులు, అధికారుల పాత్రపైనా సమగ్ర విచారణ జరపాలని ఉద్యోగ సంఘాలు కోరుతున్నాయి. సర్టిఫికెట్ జారీ సమయంలో ఏ వైద్య పరీక్షలు నిర్వహించారు? ఏ నివేదికల ఆధారంగా వైకల్యం శాతాన్ని నిర్ణయించారు? నిబంధనల ప్రకారం మెడికల్ బోర్డు ఆమోదం ఉందా? అనే అంశాలను పరిశీలించాలని విజ్ఞప్తి చేస్తున్నారు.విచారణలో నిబంధనలకు విరుద్ధంగా సర్టిఫికెట్లు జారీ చేసినట్లు తేలితే సంబంధిత బాధ్యులపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.

ఉన్నతాధికారులు స్పందించాలి

నిజమైన దివ్యాంగులకు దక్కాల్సిన చట్టబద్ధమైన హక్కులు, ప్రభుత్వ ప్రయోజనాలు అనర్హుల కారణంగా దూరం కాకుండా చూడాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందని ఉద్యోగ సంఘాలు, పౌరులు పేర్కొంటున్నారు. ఈ వ్యవహారంపై స్వతంత్ర కమిటీతో సమగ్ర విచారణ జరిపించి వాస్తవాలను వెలుగులోకి తీసుకురావాలని కోరుతున్నారు. నిజంగా అర్హులైన దివ్యాంగులకు మాత్రమే ప్రభుత్వ ప్రయోజనాలు అందేలా చర్యలు తీసుకోవడంతో పాటు, నిబంధనలకు విరుద్ధంగా సర్టిఫికెట్లు పొందినట్లు విచారణలో తేలితే సంబంధిత ఉద్యోగులు, సర్టిఫికెట్లు జారీ చేసిన వైద్యులు, అధికారులపై నిబంధనల ప్రకారం చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్ చేస్తున్నారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>