Mobile Popup Ad
Mobile Popup Ad

సాగర్ డ్యామ్‌కు హైఅలర్ట్..? ఇంటెలిజెన్స్ బ్యూరో కీలక సమీక్ష

కలం, నల్లగొండ బ్యూరో : నాగార్జునసాగర్ ప్రాజెక్టు (Nagarjuna Sagar Dam) భద్రతపై ఇంటెలిజెన్స్ హైఅలర్ట్ ప్రకటించినట్టు తెలుస్తోంది. ఇటీవల నాగార్జునసాగర్ డ్యామ్ భద్రతపై ఇంటెలిజెన్స్ బ్యూరో కీలక సమీక్ష నిర్వహించింది. నాగార్జునసాగర్‌లోని విజయవిహార్ అతిథి గృహంలో ప్రాజెక్టు అధికారులతో భేటీ అయ్యి పలు కీలక అంశాలను వెల్లడించారు. ప్రధానంగా డ్యామ్‌కు ముప్పు పొంచి ఉందనే కారణాల నేపథ్యంలో భద్రతను పెంచేందుకు నిర్ణయించింది. డ్యామ్ చుట్టూ ఉన్న సీసీ కెమెరాల నెట్‌వర్క్‌ను మరింత బలోపేతం చేయాలని, బ్లైండ్ స్పాట్స్ (కెమెరాకు చిక్కని ప్రాంతాలు) లేకుండా అణువణువూ పర్యవేక్షించాలని సూచించారు. డ్యామ్ పరిసరాల్లో, ముఖ్యంగా రాత్రి వేళల్లో జరిగే కదలికలపై నిరంతర పర్యవేక్షణ ఉండాలని ఆదేశించారు.

సాగర్‌కు వచ్చే పర్యాటకుల రాకపోకలపై ఆంక్షలు విధించారు. సందర్శకులు డ్యామ్ ముఖద్వారం లేదా కీలక ప్రాంతాలకు వెళ్లకుండా కఠిన నిబంధనలు అమలు చేయాలని స్పష్టం చేశారు. ఇదిలావుంటే.. సాగర్ ఆనకట్టకు 1990వ దశకం నుంచే ఉగ్రవాదుల నుంచి ముప్పు పొంచి ఉందని ఇంటెలిజెన్స్ నివేదికలు చెబుతున్నాయి. భద్రతా పరమైన సున్నితత్వాన్ని దృష్టిలో ఉంచుకుని, కేంద్ర హోం మంత్రిత్వ శాఖ ఈ ప్రాజెక్టును ‘ఏ’ కేటగిరీ (అత్యంత సున్నితమైన) జాబితాలో చేర్చింది. రిజర్వాయర్‌ను కాపాడుకోవడం అత్యంత ముఖ్యమని, ఏదైనా అవాంఛనీయ ఘటన జరిగితే రెండు రాష్ట్రాల ఆర్థిక, సామాజిక వ్యవస్థలు అతలాకుతలం అవుతాయని తెలంగాణ ప్రభుత్వం గతంలోనే స్పష్టం చేసింది.

విద్యుత్ ఉత్పత్తి కేంద్రం పరిశీలన..

నాగార్జునసాగర్‌లోని విద్యుత్ ఉత్పత్తి కేంద్రం భద్రతపైనా ఇంటెలిజెన్స్ అధికారులు ప్రత్యేక సమీక్షించినట్టు తెలుస్తోంది. తెలంగాణ జెన్కో జలవిద్యుత్ కేంద్రం భద్రతను ఐబీ అధికారులు ప్రత్యేకంగా పరిశీలించారు. విద్యుత్ ఉత్పత్తి కేంద్రంలోకి వెళ్లే ప్రతి ఒక్కరినీ క్షుణ్ణంగా తనిఖీ చేయాలని, సిబ్బందికి ప్రత్యేక గుర్తింపు కార్డులు తప్పనిసరి చేయాలని సూచించినట్టు సమాచారం. క్షేత్రస్థాయిలో భద్రతా ఏర్పాట్లను, లోపాలను పరిశీలించిన ఐబీ అధికారులు.. సమగ్ర నివేదికను సిద్ధం చేశారు. దీనిని కేంద్ర హోం శాఖతో పాటు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాల ఉన్నతాధికారులకు పంపారు.

భవిష్యత్తులో డ్యామ్ (Nagarjuna Sagar Dam) వద్ద భద్రతను మరింత పెంచేందుకు అదనపు బలగాల కేటాయింపు, అధునాతన స్కానింగ్ పరికరాల ఏర్పాటుపై ఈ నివేదికలో కీలక సిఫార్సులు ఉన్నట్లు తెలుస్తోంది. నాగార్జునసాగర్ భద్రత అనేది కేవలం ఒక ప్రాంతానికో.. రాష్ట్రానికో పరిమితమైన అంశం కాదు. ఇది దేశ భద్రతలో ఒక భాగం. ఇంటెలిజెన్స్ అధికారుల తాజా సమీక్షతో సాగర్ వద్ద పటిష్టమైన రక్షణ కవచం ఏర్పడనుందని సమాచారం.

 Read Also: హామీ 42%.. గెలిచింది 62%.. ‘మున్సిపోల్స్’లో రిజర్వేషన్

Follow Us On: Sharechat

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>