epaper
Wednesday, February 18, 2026
epaper

హామీ 42%.. గెలిచింది 62%.. ‘మున్సిపోల్స్’లో రిజర్వేషన్

కలం, తెలంగాణ బ్యూరో : స్థానిక సంస్థల్లో బీసీలకు 42% రిజర్వేషన్ (BC Reservations) అంశంపై రాష్ట్రంలో తీవ్ర స్థాయిలో చర్చ జరుగుతున్నది. అసెంబ్లీ ఎన్నికలకు ముందు కూడా కాంగ్రెస్ ఈ హామీ ఇచ్చింది. రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేకంగా సర్వే నిర్వహించి మొత్తం జనాభాలో 56.33% బీసీలు ఉన్నట్లు తేల్చింది. అసెంబ్లీలో చర్చించి స్థానిక సంస్థలు, విద్య, ఉద్యోగాల్లో 42% బీసీ రిజర్వేషన్ కోసం చట్టం తెచ్చింది. రాజ్యాంగ సవరణ కోసం కేంద్రానికి పంపింది. కానీ ఇప్పటివరకూ కదలిక లేదు. ఈ లోగా మున్సిపల్ ఎన్నికలు రానే వచ్చాయి. బీసీ రిజర్వేషన్ 42% అమలుకు లీగల్ చిక్కులు ఏర్పడ్డాయి. విధిలేని పరిస్థితుల్లో మున్సిపాలిటీల్లో 28.22%, కార్పొరేషన్‌లలో 35.25% చొప్పున బీసీ రిజర్వేషన్ ఫార్ములా ఖరారైంది. చివరకు జనరల్ స్థానాల్లోనూ కాంగ్రెస్ బీసీ అభ్యర్థులకు అవకాశం ఇచ్చింది.

రాష్ట్రంలో 62% మంది బీసీ చైర్‌పర్సన్లు :

రాష్ట్రవ్యాప్తంగా అన్ని పార్టీల్లో కలిసి మున్సిపల్ చైర్‌పర్సన్‌లుగా 66 మంది బీసీలు కొలువుదీరారు. ఇందులో కాంగ్రెస్ తరఫున 52 మంది, బీఆర్ఎస్ తరఫున 11 మంది, బీజేపీ తరఫున ఒకరు, ఇద్దరు ఇండిపెండెంట్లు బీసీలున్నారు. దీంతో సగటున రాష్ట్రంలోని 116 మున్సిపాలిటీల్లో 66 మంది చైర్‌పర్సన్లు బీసీలు కావడంతో రిజర్వేషన్ దాదాపు 62% అయినట్లయింది. కాంగ్రెస్ హామీ ఇచ్చింది 42% బీసీ రిజర్వేషన్ అయినా చివరకు 62%గా అమలైంది. రాష్ట్ర ఎన్నికల సంఘం, రాష్ట్ర పురపాలక శాఖ ఖరారు చేసిన రిజర్వేషన్ ఫార్ములా ప్రకారం 35 మున్సిపాలిటీల్లో బీసీ చైర్‌పర్సన్లు ఎన్నిక కాగా జనరల్ కోటాలోకి వచ్చే మరో 31 చోట్ల కూడా బీసీ కార్పొరేటర్లే చైర్‌పర్సన్లు అయ్యారు. దీనికి తోడు నిజామాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ మేయర్ పోస్టు జనరల్ మహిళ అయినప్పటికీ పీసీసీ చీఫ్ సొంత జిల్లా కావడంతో బీసీ మహిళకు ఆ అవకాశం ఇచ్చారు.

సీఎం సొంత జిల్లాలో బీసీలకు ప్రయారిటీ :

ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి సొంత జిల్లా ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లాలో మొత్తం 18 మున్సిపాలిటీల్లో ఇద్దరు మినహా మిగిలిన చైర్‌పర్సన్లంతా బీసీ సామాజికవర్గానికి చెందినవారే. కాంగ్రెస్ ఇచ్చిన హామీగానీ, రాష్ట్ర ప్రభుత్వంగానీ 42% రిజర్వేషన్ (BC Reservations) దక్కాల్సి ఉన్నది. కానీ ఆదర్శంగా తీసుకున్న ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి తన సొంత జిల్లాలో మాత్రం ఇద్దరు మినహా మిగిలిన మున్సిపాలిటీల చైర్‌పర్సన్ పోస్టులన్నింటినీ బీసీలకే దక్కేలా చొరవ తీసుకోవడంపై రాష్ట్ర బీసీ కమిషన్, రాష్ట్రంలోని పలు బీసీ సంఘాలు, బీసీ సంఘాల జేఏసీ హర్షం వ్యక్తం చేసింది. పంచాయతీ ఎన్నికల్లో సైతం 52.75% మేర సర్పంచ్‌లు బీసీలే. అటు పంచాయతీలు, ఇటు మున్సిపాలిటీల్లో బీసీలకు నిర్దిష్ట 42% రిజర్వేషన్ హామీ కంటే ఎక్కువగానే ప్రయారిటీ వచ్చినట్లు గుర్తుచేశాయి.

Read Also: సీఎం నెక్స్ట్ టార్గెట్… జీహెచ్ఎంసీ ఎలక్షన్స్ !

Follow Us On: Sharechat

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>