కలం, వెబ్ డెస్క్: వైఎస్సార్సీపీ ఎమ్మెల్సీ, మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ (Botsa Satyanarayana) కు హెరిటేజ్ సంస్థ లీగల్ నోటీస్ ఇచ్చింది. సంస్థ ప్రతిష్ఠ దెబ్బతీసేలా మాట్లాడారని అందులో పేర్కొంది. అసత్య, నిరాధార ఆరోపణలు చేశారని, వాటికి సమాధానం చెప్పాలని డిమాండ్ చేసింది. ఈ మేరకు హెరిటేజ్ తరఫున న్యాయవాది మల్లికార్జున రావు లీగల్ నోటీసులు పంపారు.
‘హెరిటేజ్ సంస్థ ఎన్నో ఏళ్లుగా చట్ట ప్రకారం నడుస్తోంది. జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు, ప్రశంసలు పొందింది. ఫుడ్ సేఫ్టీ రూల్స్‌ను పాటిస్తోంది. అలాంటి మా సంస్థపై దుష్ర్పచారం చేశారు. ఇందాపూర్ డెయిరీతో సంబంధం లేకున్నా అసత్య ఆరోపణలు చేశారు. 22 సంస్థలతో హెరిటేజ్ సిండికేట్ అయ్యిందని నిరాధార ఆరోపణలు చేశారు. ప్రజల్లో హెరిటేజ్ సంస్థపై ఉన్న నమ్మకాన్ని దెబ్బతీసేలా మాట్లాడారు. దీనిపై తక్షణమే బొత్స సత్యనారాయణ (Botsa Satyanarayana) క్షమాపణలు చెప్పాలి. తన వ్యాఖ్యలను వెనక్కి తీసుకోవాలి. లేకపోతే సివిల్, క్రిమినల్ చర్యలు తీసుకోవాల్సి ఉంటుంది’ అని ఆ నోటీసుల్లో పేర్కొన్నారు.


