ఉప్పెనలా భక్తులు.. యాదగిరిగుట్టలో అవస్థలు

కలం యాదగిరిగుట్ట: యాదగిరిగుట్ట (Yadagirigutta) శ్రీ లక్ష్మీనరసింహ స్వామి ఆలయానికి ఆదివారం భక్తులు పోటెత్తారు. వివిధ రాష్ట్రాల నుంచి అధిక సంఖ్యలో తరలిరావడంతో.. రద్దీకి అనుగుణంగా బస్సులు లేవు. దీంతో గంటల తరబడి భక్తులు కొండ పైన, కింద ఉన్న బస్టాండ్లలో నిరీక్షించాల్సి వస్తోంది.

ఇప్పుడు కూడా కేవలం ఆరు బస్సులే..

అసలే వారాంతం.. భారీగా భక్తులు వచ్చే రోజులు. అయినా అధికారులు మాత్రం యాదగిరిగుట్ట కొండపైకి, కొండ కిందకు కేవలం ఆరు బస్సులను మాత్రమే నడిపారు. ఒక్కో బస్సులో 50 మంది ప్రయాణికులు ఎక్కాల్సి ఉండగా.. వంద మందికి పైగా వెళ్తున్నారు. చాలా మంది ఫుట్ బోర్డుపై నిలబడి ప్రయాణం చేయాల్సి వస్తోంది. బస్సుల్లో వెళ్లే అవకాశం లేని వారు మెట్ల మార్గంలో వచ్చి స్వామివారిని దర్శించుకున్నారు.

మూడు గంటల పాటు ధర్మ దర్శనం క్యూలైన్లో నిల్చోని స్వామి వారిని దర్శించుకున్నాక.. కొండ పైన బస్టాండ్ వద్దకు వస్తే ఒక్క బస్సు కూడా లేదని భక్తులు వాపోయారు. ఒకేసారి అయిదారు బస్సులు వచ్చినా పోటీపడుతూ ఎక్కారని.. మరో గంట వేచి చూస్తే గానీ, బస్సు రావడం లేదని మండిపడ్డారు. వెంటనే ఆలయ, డిపో అధికారులు స్పందించి రద్దీకి అనుగుణంగా బస్సుల సంఖ్య పెంచాలని సూచించారు.

మంచి నీరు కూడా లేదు..

ధర్మ దర్శనం, వీఐపీ దర్శనం కోసం క్యూలైన్లలో చిన్న పిల్లలతో వచ్చిన కుటుంబాలు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. ఉక్కపోతతో పాటు క్యూ కాంప్లెక్స్ నుంచి గోల్డ్ క్యూలైన్లోకి వచ్చే వరకు మంచి నీళ్లు ఇచ్చేవారే లేరు. ఆలయ అధికారులు రూ.150 క్యూలైన్, గోల్డ్ క్యూలైన్లోని భక్తులకు మాత్రమే తాగునీటిని సరఫరా చేస్తున్నారని భక్తులు వాపోయారు.

పలుకుబడితో పలువురు భక్తులు నేరుగా తూర్పు రాజగోపురం ముందు ఉన్న మెయిన్ గేట్ ద్వారా ఆలయంలోకి వెళ్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. దీంతో చాలా మంది తూర్పు రాజగోపురం ముందు నుంచి, వైకుంఠద్వారం వద్ద స్వామిని మొక్కి దర్శనం చేసుకోకుండానే వెనక్కి వెళ్లిపోతుండటం కనిపిస్తోంది.

మొక్కేది భక్తులు.. కొట్టేది కాంట్రాక్టర్లు..

ధర్మ దర్శనం క్యూ లైన్లో మొక్కులు చెల్లించుకునే క్రమంలో కొబ్బరికాయ కూడా కొట్టలేని పరిస్థితి కనిపిస్తోందని భక్తులు ఆవేదన చెందుతున్నారు. స్వామివారికి మొక్కు మాదైతే.. కొట్టేది కాంట్రాక్టర్లు అని హైదరాబాద్‌కు చెందిన భక్తుడు సంతోష్ తెలిపారు.

తమను కొట్టనివ్వకుండా వారే కొట్టి.. పైగా డబ్బులు వసూల్ చేస్తున్నారని మండిపడ్డారు. ఇదిలా ఉంటే, కొబ్బరికాయ నీటిని వాటర్ బాటిళ్లలో నింపుకుంటూ.. ఒక్కోటి వంద రూపాయలకు విక్రయించుకుంటూ ఆధ్యాత్మిక క్షేత్రాన్ని భ్రష్టు పట్టిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

ప్రసాదం కౌంటర్ల వద్ద అదే పరిస్థితి..

ప్రసాదం కౌంటర్ అఖండ దీపం పక్కన.. విక్రయశాల మరో చోట ఉండటంతో టిక్కెట్ కొనుగోలు చేసి ప్రసాదం తీసుకోవడానికి కూడా గంటల సమయం పడుతోంది. విక్రయశాల పక్కనే కౌంటర్ పెట్టాలని భక్తులు డిమాండ్ చేస్తున్నారు.

కుటుంబ సభ్యులతో రూ.150 టికెట్ కొనుగోలు చేసి స్వామిని దర్శించుకున్నామని.. ప్రసాదం కౌంటర్ వద్దకు వెళ్లగానే భారీ లైన్ ఉందని ఓ భక్తుడు చెప్పారు. వృద్ధులు, దివ్యాంగులకు ప్రసాదం సెక్షన్ వద్ద సరైన ఏర్పాట్లు లేకపోవడంతో వాళ్లకు ఇబ్బందులు తప్పడం లేదన్నారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>