కలం, మెదక్ బ్యూరో: ఉమ్మడి మెదక్ (Medak) జిల్లా వ్యాప్తంగా వాతావరణం ఒక్కసారిగా మారిపోయింది. గత కొన్ని రోజులుగా భానుడి భగభగలతో అల్లాడిపోతున్న ప్రజలకు వరుణుడు చల్లని కబురు అందించాడు. ఉమ్మడి మెదక్ జిల్లాలో మంగళవారం అర్ధరాత్రి నుంచి భారీ వర్షాలు (Heavy rains) కురుస్తున్నాయి. సంగారెడ్డి జిల్లా వట్ పల్లిలో 7.5 సెంటీమీటర్ల భారీ వర్షపాతం నమోదైంది. న్యాల్ కల్ మండలంలో 7.3 సెంటీ మీటర్లు, హత్నూర మండలంలో 6.8 సెం.మీ వర్షపాతం నమోదైంది.
కాగా మెదక్ జిల్లా నర్సాపూర్ మండలంలో 4.9 సెం.మీ , పాపన్నపేట మండలంలో 4.7 సెం.మీ. వర్షపాతం నమోదైంది. సిద్దిపేట జిల్లా మర్కుక్ మండలం అంగడి కిష్టాపూర్ లో 6.5 సెం.మీ వర్షపాతం నమోదైంది. ఈ రోజు ఉమ్మడి మెదక్ జిల్లా అంతటా ఆకాశం మేఘావృతమై, వర్షాలు పడుతున్నాయి.

