కలం, వెబ్ డెస్క్ : కేరళ రాజకీయాల్లో సంచలన పరిణామం చోటుచేసుకుంది. మనీలాండరింగ్ కేసులో భాగంగా కేరళ మాజీ ముఖ్యమంత్రి, ప్రస్తుత ప్రతిపక్ష నాయకుడు పినరయి విజయన్ (Pinarayi Vijayan) నివాసంలో ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ED) అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు. ఆయనతోపాటు విజయన్ కుమార్తె వీణా నివాసంలోనూ ఈ తనిఖీలు కొనసాగుతుండటం తీవ్ర కలకలం రేపుతోంది.
కొచ్చిన్ మినరల్స్ అండ్ రూటిల్ లిమిటెడ్ (CMRL) కంపెనీకి సంబంధించిన కేసులో ఈడీ అధికారులు రంగంలోకి దిగారు. కేరళ వ్యాప్తంగా మొత్తం 12 ప్రాంతాల్లో ఏకకాలంలో దాడులు నిర్వహిస్తున్నారు. విజయన్ కుమార్తె వీణాకు చెందిన ఐటీ కంపెనీ ఆర్థిక లావాదేవీలపై అధికారులు ప్రధానంగా దృష్టి సారించారు. ఎలాంటి సేవలు అందించకుండానే సీఎంఆర్‌ఎల్ సంస్థ నుంచి వీణా రూ. 1.72 కోట్లు తీసుకున్నారనే ఆరోపణలు వచ్చాయి. ఈ వ్యవహారంపైనే ఈడీ ప్రస్తుతం ఆరా తీస్తోంది. గతంలోనే పినరయి విజయన్ ఈ ఆరోపణలను తీవ్రంగా ఖండించారు. తన భార్య పదవీ విరమణ నిధులతోనే కుమార్తె ఆ కంపెనీని ప్రారంభించిందని, ఇందులో ఎలాంటి అక్రమాలు జరగలేదని ఆయన స్పష్టం చేశారు. ప్రస్తుత ఈడీ సోదాలతో కేరళలో రాజకీయ వాతావరణం ఒక్కసారిగా వేడెక్కింది.

