కలం, వెబ్ డెస్క్: తెలంగాణ (Telangana)లో ఎండలతో ఉక్కిరిబిక్కిరి అవుతోన్న రాష్ట్ర ప్రజలకు హైదరాబాద్ (Hyderabad) వాతావరణ శాఖ చల్లని కబురు అందించింది. రాష్ట్రంలో రాబోయే మూడు రోజుల పాటు ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు (Rains) కురిసే అవకాశం ఉందని వెల్లడించింది. ఉపరితల ద్రోణి ప్రభావంతో రాష్ట్ర వ్యాప్తంగా వర్షాలు కురుస్తాయని తెలిపింది.. రాష్ట్రంలోని హైదరాబాద్, మేడ్చల్ మల్కాజిగిరి, కామారెడ్డి, సిద్ధిపేట, జనగాం జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. అన్ని జిల్లాల్లో మోస్తరు వర్షాలు, వడగండ్ల వాన కురిసే అవకాశం ఉందని తెలిపింది.
క్యూమలో నింబస్ మేఘాల ప్రభావంతో సాయంత్ర సమయాల్లో వర్షం కురిసే ఛాన్స్ ఉందని పేర్కొంది. రాష్ట్రంలో రానున్న మూడు, నాలుగు రోజులలో గరిష్ట ఉష్ణోగ్రతలు క్రమేపి మూడు నుంచి నాలుగు డిగ్రీలు తగ్గే అవకాశం ఉందని అంచనా వేసింది. కొన్ని జిల్లాలలో ఉరుములు మెరుపులతో పాటు 30 నుండి 40 కి.మీ వేగంతో కూడిన ఈదురుగాలులు వీచే అవకాశం ఉందని తెలిపింది. ఇక గురువారం రాష్ట్రంలోని కొన్ని జిల్లాలలో ఉరుములు మెరుపులు, 40 నుండి 50 కి.మీ. వేగంతో ఈదురుగాలులు వీస్తాయని వాతావరణ శాఖ వివరించింది.
అటు గత రెండు రోజులుగా రాష్ట్రంలోని పలు జిల్లాలో భారీ వర్షాలు (Telangana Rains) పడుతున్నాయి. పలు చోట వడగండ్ల వాన బీభత్సాన్ని సృష్టిస్తోంది. హైదరాబాద్ లో కూడా భారీ వర్షాలు పడుతున్నాయి. మంగళవారం రాత్రి ఉరుములు మెరుపులతో భారీ వర్షం కురిసింది. అమీర్‌పేట, ఎస్‌ఆర్‌నగర్, బంజారాహిల్స్, జూబ్లీహిల్స్, చింతల్, షాపూర్, జీడిమెట్ల, మహేశ్వరం, షాద్‌నగర్, శంషాబాద్, రాజేంద్రనగర్, బండ్లగూడ జాగీర్, బహదూర్‌పురా, కార్వాన్, కాటేదాన్, బార్కస్, చాంద్రయణగుట్ట, చార్మినార్, ఎల్‌బీ నగర్, సరూర్ నగర్, వనస్థలిపురం, దిల్‌సుఖ్‌నగర్, సంతోష్‌నగర్, చాదర్‌ఘాట్, కోఠి, నల్లకుంట, రాంనగర్, తార్నాక, హబ్సిగూడ, సికింద్రాబాద్, ఖైరతాబాద్, బేగంపేట్, పంజాగుట్ట, సోమాజిగూడ, మెహిదీపట్నంతో పాటు కుత్బుల్లాపూర్ నియోజకవర్గంలో భారీ వర్షం కురిసింది.
అలాగే పలు జిల్లాల్లో మరో 2-3 గంటల పాటు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ ‘నౌకాస్ట్’ విడుదల చేసింది. ఈదురుగాలులు, ఉరుములు, మెరుపులతో కూడిన తేలికపాటి వర్షం కురిసే అవకాశం ఉన్నందున ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు. అకాల వర్షానికి అన్నదాతలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. వరి ధాన్యం అక్కడక్కడ తడిసిపోవడంతో రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మామిడి పంటకు తీవ్ర నష్టం వాటిల్లింది. ఈదురుగాలుల నేపథ్యంలో మామిడి కాయలు నేలరాలడంతో రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ నెల 22వ తేదీ వరకు వర్షాలు కొనసాగే ఛాన్స్ ఉందని వాతావరణ శాఖ తెలిపింది.
Read Also: జర్నలిస్టులను ఆదుకోండి : ఎమ్మెల్సీ నెల్లికంటి సత్యం
Follow Us On: Facebook

