కలం, నల్లగొండ బ్యూరో : జర్నలిస్టుల సమస్యలను పరిష్కరించాలని, పాలకులు ఎప్పటికప్పుడు వాయిదా వేసుకుంటూ వస్తున్నారని సీపీఐ ఎమ్మెల్సీ నెల్లికంటి సత్యం (MLC Nellikanti Satyam) తెలిపారు. ఈ మేరకు బుదవారం శాసనమండలిలో జర్నలిస్టుల సమస్యలపై గళం విన్పించారు. రాష్ట్రంలోని జర్నలిస్టుల సమస్యలు ప్రస్తుతం చాలా తీవ్రంగా ఉన్నాయని, సమాజంలోని వివిధ సమస్యలను వెలుగులోకి తీసుకురావడంలో వారి పాత్ర కీలకమని ఆయన కొనియాడారు. కానీ వారి బతుకులకు భరోసా లేకుండా పోయిందన్నారు.
జర్నలిస్టుల వేతనాలు, ఆరోగ్య బీమా వంటి అంశాల్లో వారు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని, వాటిని పరిష్కరించాలని కోరారు. చాలా మంది జర్నలిస్టులకు సకాలంలో అక్రిడిటేషన్ కార్డులు అందడం లేదని, ఇది వారి పనికి ఆటంకం కలిగిస్తోందని తెలిపారు. ఇటీవల కాలంలో చిన్న వయసులోనే చాలా మంది జర్నలిస్టులు మరణించారని, వారి కుటుంబాలను ప్రభుత్వం ఆదుకోవాల్సిన బాధ్యత ఉందని గుర్తు చేశారు. జిల్లా, మండల స్థాయిల్లో పనిచేస్తున్న జర్నలిస్టులకు ఇళ్ల స్థలాలు కేటాయించాలని ఆయన విజ్ఞప్తి చేశారు. జర్నలిస్టుల సంక్షేమం కోసం ప్రభుత్వం తక్షణమే స్పందించి, వారి సమస్యల పరిష్కారానికి కృషి చేయాలని ఎమ్మెల్సీ నెల్లికంటి సత్యం (MLC Nellikanti Satyam) ప్రభుత్వాన్ని కోరారు.

