కలం, వెబ్ డెస్క్ : కర్నూలు జిల్లా ఆలూరు నియోజకవర్గ పరిధిలోని చిప్పగిరి మండలంలో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. వైసీపీ ఎమ్మెల్యే బి. విరూపాక్షి (MLA Virupakshi), ఆయన కుమారుడు చంద్రశేఖర్లను పోలీసులు అర్ధరాత్రి వేళ అరెస్ట్ చేయడం స్థానికంగా పెను దుమారం రేపింది. ఈ అరెస్టును తీవ్రంగా ఖండిస్తూ వైసీపీ శ్రేణులు చిప్పగిరిలో భారీ ఎత్తున రోడ్లపైకి వచ్చి ఆందోళనలు చేపట్టాయి. రాష్ట్రంలోని కూటమి ప్రభుత్వం కేవలం రాజకీయ కక్షసాధింపు చర్యల్లో భాగంగానే అక్రమ అరెస్టులకు పాల్పడుతోందని పార్టీ నాయకులు, కార్యకర్తలు ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఈ వివాదానికి ప్రధాన కారణం చిప్పగిరి మండలం సంగాల, నేమకల్లు గ్రామాల్లో టీడీపీ, వైసీపీ వర్గాల మధ్య జరిగిన పరస్పర ఘర్షణలేనని తెలుస్తోంది. నేమకల్లు గ్రామానికి చెందిన టీడీపీ కార్యకర్తకు, సంగాల గ్రామానికి చెందిన వైసీపీ నేత గిరికి మధ్య ఫోన్ లో చోటుచేసుకున్న వ్యక్తిగత వివాదం ఇరు వర్గాల మధ్య పెద్ద గొడవకు దారితీసింది.
ఈ క్రమంలో తమ పార్టీ నాయకుడిని పరామర్శించేందుకు ఎమ్మెల్యే విరూపాక్షి (MLA Virupakshi) తన అనుచరులతో కలిసి అక్కడికి వెళ్లిన సందర్భంలో ఇరువర్గాల మధ్య రాళ్ల దాడి జరిగింది. ఈ ఘటనలో ఇరు పార్టీలకు చెందిన పలువురికి గాయాలయ్యాయి. అనంతరం రంగంలోకి దిగిన పోలీసులు శాంతిభద్రతల పరిరక్షణ పేరుతో భారీ బలగాలను మోహరించి, అర్ధరాత్రి వేళ ఎమ్మెల్యే నివాసానికి చేరుకుని ఆయన్ను, ఆయన కుమారుడిని అదుపులోకి తీసుకుని చిప్పగిరి పోలీస్ స్టేషన్కు తరలించారు.
ఎమ్మెల్యే విరూపాక్షిని, ఆయన కుమారుడిని ఎలాంటి ముందస్తు నోటీసులు లేకుండా అర్ధరాత్రి వేళ దౌర్జన్యంగా అరెస్ట్ చేయడం ప్రజాస్వామ్య విరుద్ధమని వైసీపీ నేతలు మండిపడ్డారు. పోలీసులు నిష్పక్షపాతంగా వ్యవహరించకుండా, అధికార పార్టీ ఒత్తిళ్లకు తలొగ్గి ఏకపక్షంగా కేసులు నమోదు చేశారని ఆరోపించారు. ఎమ్మెల్యే విరూపాక్షిని వెంటనే బేషరతుగా విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ చిప్పగిరి పరిసర ప్రాంతాల్లో వైసీపీ శ్రేణులు భారీ నిరసన ప్రదర్శనలు నిర్వహించాయి. ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో పోలీసులు ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా చిప్పగిరి పోలీస్ స్టేషన్ పరిసరాల్లో భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు.
Also Read : ఏపీ ప్రభుత్వానికి ఆక్వా రైతుల వార్నింగ్
Follow Us On : WhatsApp

