కలం, వెబ్ డెస్క్: ఆగస్ట్ ఏడో తేదీలోగా తమ సమస్యలు పరిష్కరించకపోతే అమరావతికి భారీ పాదయాత్ర నిర్వహిస్తామని ఆక్వా రైతులు (Aqua Farmers) ఏపీ ప్రభుత్వాన్ని హెచ్చరించారు. ఈ మేరకు పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లు వేదికగా ఆక్వా రైతులు ఉద్యమం ప్రారంభించారు. ఇప్పటికీ చాలా సార్లు విన్నవించినా రాష్ట్ర ప్రభుత్వం స్పందించడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. నేరుగా అమరావతికే వెళ్లి సీఎం చంద్రబాబు, వ్యవసాయ మంత్రి అచ్చెన్నాయుడికి సమస్య విన్నవిస్తామని చెబుతున్నారు.
సిండికేట్ అవడంతో రైతులకు నష్టం..
దేశ వ్యాప్తంగా రొయ్యల సాగు 70 శాతం ఏపీలో జరుగుతోందని ఆక్వా రైతులు చెబుతున్నారు. సాగు ఖర్చుల కారణంగా తాము తీవ్ర ఆర్థిక సంక్షోభంలో కూరుకుపోతున్నట్లు ఆవేదన వ్యక్తం చేశారు. పెట్టుబడులు ఎక్కువగా, గిట్టుబాటు తక్కువ ఉండటంతో రొయ్యల సాగు చేపట్టలేని పరిస్థితి ఏర్పడిందన్నారు. రొయ్యల మేతను కిలో రూ.4 తగ్గించాలని సీఎం చంద్రబాబు కంపెనీలకు ఆదేశించారని గుర్తు చేసుకుంటున్నారు. కానీ, కంపెనీలన్నీ సిండికేట్‌గా మారి కేవలం రెండు రూపాయలే తగ్గించాయని వాపోతున్నారు. ఈ గుత్తాధిపత్యం కారణంగానే రైతులు తీవ్రంగా నష్టపోతున్నారని.. వెంటనే ప్రభుత్వం స్పందించాలని డిమాండ్ చేస్తున్నారు.

