కలం, వెబ్ డెస్క్: తెలంగాణలోని పలు జిల్లాలో శనివారం భారీ వర్షం (Heavy rain) కురిసింది. ముఖ్యంగా కామారెడ్డి, సిరిసిల్ల జిలాల్లో ఉరుములు, మెరుపులతో వర్షం బీభత్సం సృష్టించింది. సంగారెడ్డి, వికారాబాద్, రంగారెడ్డి, మెదక్ వంటి ప్రాంతాల్లో భారీ వాన కురిసింది. నార్త్ హైదరాబాద్ లోని కొన్ని ప్రాంతాల్లో కూడా అక్కడక్కడా వర్షాలు కురిసినట్లు హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. కాగా రానున్న మరో గంటలో మెదక్, మేడ్చల్, ఘట్‌కేసర్, యాదాద్రి భువనగిరి, సిద్దిపేట, జనగాం, సిరిసిల్ల, కరీంనగర్, పెద్దపల్లి, జగిత్యాల, మంచిర్యాల, హన్మకొండ ప్రాంతాల్లో అక్కడక్కడా ఉరుములు, మెరుపులుతో పాటు తేలికపాటి నుంచి మోస్తరు వర్షం కురిసే ఛాన్స్ ఉందని వాతావరణ శాఖ తెలిపింది. ఈ మేరకు పలు జిల్లాలకు అధికారులు ఆరెంజ్ అలర్ట్ జారీ చేశారు. ఇక హైదరాబాద్ లోని లింగంపల్లి, కాప్రా, ఉప్పల్, నాగోల్, వనస్థలిపురం, హైదరాబాద్ ఎయిర్‌పోర్ట్ ప్రాంతాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు పడే అవకాశం ఉందని తెలిపింది.ఉరుములు మెరుపులతో పాటు గంటకు 41నుంచి 61కిలోమీటర్ల వేగంతో బలమైన గాలులు వీస్తాయని తెలిపింది.
రాజన్న సిరిసిల్లలోని ఎల్లారెడ్డిపేట మండలంలో తెల్లవారుఝామున 3 గంటల నుంచి ఉరుములు, మెరుపులతో భారీ వర్షం కురుస్తోంది. పలు ప్రాంతాల్లో చెట్లు విరిగిపోయి రోడ్లకు అడ్డంగా పడిపోయాయి. వర్షం దాటికి రోడ్లు, మురికికాలువలు జలమయం అయ్యాయి. కళ్లాల్లో ధాన్యం తడిసిపోయింది. మామిడితోటల్లో కాయలు రాలిపోయాయి. దీంతో రైతన్నలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వీర్నపల్లి మండలకేంద్రంలో శనివారం రాత్రి వీచిన బలమైన ఈదురుగాలులు, వడగండ్ల వర్షం రైతన్నలను నిండా ముంచాయి. సబ్ స్టేషన్ నుంచి వన్ పల్లివెళ్లే ప్రధాన రహదారిపై కిలోమీటర్ పొడవునా భారీ వృక్షాలు, విద్యుత్ స్తంబాలు నేలకొరిగాయి. కరెంట్ పోల్స్ నేలకొరగడంతో విద్యుత్ సరఫరా స్తంభించింది. అటు కరీంనగర్ జిల్లాలోని సైదాపూర్ మండలం లస్మన్న పల్లి, ఆరెపల్లి, వెన్నంపల్లి, సోమారం, ఎక్లాసూర్ తదితర గ్రామాల్లోరాత్రి నుంచి ఉరుములు మెరుపులతో భారీ వర్షం కురిసింది.
ఇక కామారెడ్డి జిల్లా తాడ్వాయి మండలం కన్కల్-తాడ్వాయి రోడ్డుపై శనివారం రాత్రి కురిసిన అకాల వర్షానికి చెట్లు నేలకొరిగాయి. దీంతో కామారెడ్డి వైపు వెళ్లేవారు తీవ్ర ఇబ్బందులు పడ్డారు.పలు చోట్ల మొక్కజొన్న పంట మొత్తం తడిసిపోయింది. అటు కామారెడ్డి పట్టణంలో భారీ వర్షం కురిసింది. బస్టాండ్, రైల్వే స్టేషన్ సమీపంలో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. బతుకమ్మ కుంట, ఇందిరా నగర్ ప్రాంతాల్లో పాదాచారులు, చిరువ్యాపారులు ఇబ్బంది పడ్డారు.

