వారం రోజులు మండే ఎండలు.. హెచ్చరించిన వాతావరణ శాఖ..

కలం, తెలంగాణ బ్యూరో: రాబోయే వారం రోజుల పాటు రాష్ట్రంలోని పలు జిల్లాల్లో సాధారణం కంటే ఎక్కువ పగటి ఉష్ణోగ్రత నమోదవుతుందని, ప్రజలు జాగ్రత్తగా ఉండాలని కేంద్ర, రాష్ట్ర వాతావరణ శాఖలు, రాష్ట్ర ప్రభుత్వం హెచ్చరించాయి. వీటిని దృష్టిలో పెట్టుకుని రాష్ట్ర విపత్తు నిర్వహణ విభాగం ప్రత్యేకంగా సర్క్యులర్ జారీచేసింది. అన్ని డిపార్టుమెంట్లు అప్రమత్తమై ప్రాణ నష్టం జరగకుండా ఏర్పాట్లు చేయాలని సూచించింది. ఈ సంవత్సరం జూన్ సెకండాఫ్ వరకూ సమ్మర్ హీట్ కొనసాగుతుందని స్పష్టత ఇచ్చింది. ఖమ్మం, కరీంనగర్, నిజామాబాద్, ఆదిలాబాద్ జిల్లాల్లో సగటుకంటే దాదాపు నాలుగున్నర డిగ్రీల మేర ఎక్కువ టెంపరేచర్ ఉండొచ్చని పేర్కొన్నది. రాష్ట్రంలో సగటున డే టైమ్ 41-44 డిగ్రీలకంటే ఎక్కువ టెంపరేచర్ ఉంటుందని, కొన్ని చోట్ల వడగాడ్పులు వీస్తాయని తెలిపింది. రాత్రిపూట సైతం టెంపరేచర్ కాస్త ఎక్కువగానే ఉంటుందని, హీట్ స్ట్రెస్ ఏర్పడవచ్చని తెలిపింది. ఈ కారణంగా రోజువారీ కార్యకలాపాల్లో యాక్టివ్‌గా పాల్గొనే ఉత్సాహం, శక్తి ఉండదని వివరించింది.

పిల్లలు, వృద్ధులు, కూలీలకు ఎక్కువ రిస్క్ :

వేసవి తీవ్రత ఎక్కువగా పిల్లలు, వృద్ధులు, పగటిపూట ఓపెన్‌గా పనిచేసే కూలీలు, కార్మికులపై పడుతుందని, హఠాత్తుగా అపస్మారకంలోకి వెళ్లే ప్రమాదముందని రాష్ట్ర డిజాస్టర్ మేనేజ్‌మెంట్ విభాగం ఆ సర్క్యులర్‌లో పేర్కొన్నది. వ్యవసాయ పనులు, భవన నిర్మాణం, ట్రాన్స్‌పోర్ట్, పారిశుద్యం తదితర పనులు చేసేవారు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించింది. పట్టణాల్లోని పేదలు, మురికివాడల్లో నివసిస్తున్నవారిపైనా, పెంపుడు జంతువులపైనా కూడా గణనీయమైన ప్రభావమే ఉంటుందని పేర్కొన్నది. వీటిని దృష్టిలో పెట్టుకుని ఏయే శాఖ ఎలాంటి పాత్ర పోషించాలో క్లారిటీ ఇచ్చింది. దీనికి అనుగుణంగా వైద్యారోగ్య శాఖ మంత్రి దామోదర రాజనర్సింహ కూడా అధికారులతో రివ్యూ మీటింగ్ పెట్టి వడదెబ్బ నివారణ చర్యలపై ఆదేశాలు జారీచేశారు. ప్రతీ పీహెచ్‌సీ మొదలు జనరల్ ఆస్పత్రి వరకు ఓఆర్ఎస్ సహా అవసరమైన మందులన్నీ సిద్ధంగా ఉంచుకోవాలని ఆదేశించారు.

హీట్ వేవ్ యాక్షన్ ప్లాన్ లేకుండానే.. :

ప్రతీ సంవత్సరం రాష్ట్ర ప్రభుత్వం తరఫున డిజాస్టర్ మేనేజ్‌మెంట్ వేసవి తీవ్రతను దృష్టిలో పెట్టుకుని హీట్ వేవ్ యాక్షన్ ప్లాన్‌ను విడుదల చేస్తుంది. గతేడాది ఏప్రిల్ సెకండ్ వీక్‌లో రిలీజ్ చేసిన డిజాస్టర్ విభాగం ఈసారి సెకండ్ వీక్ పూర్తయినా విడుదల చేయలేదు. త్వరలోనే విడుదల చేస్తామని తెలిపింది. అప్పటివరకూ జిల్లా డిజాస్టర్ మేనేజ్‌మెంట్ అథారిటీ అధికారులు అప్రమత్తంగా ఉండాలని, వారి పరిధిలోని ప్రాంతాల్లో వేసవి తీవ్రత ఎలా ఉన్నదో రోజువారీ రిపోర్టులు తెప్పించుకుని దానికి తగిన విధంగా చర్యలు చేపట్టాలని సూచించింది. మరోవైపు జిల్లా కలెక్టర్లు ప్రతీ జిల్లాకు నోడల్ అధికారులను నియమించాలని, జిల్లా స్టాటిస్టికల్ అధికారులతో సమన్వయం చేసుకోవాలని సూచించింది. ప్రతీ జిల్లా కలెక్టర్ డైలీ స్టేటస్ రిపోర్టును హైదరాబాద్‌కు పంపాలని స్పష్టం చేసింది.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>