మావోయిస్టు అగ్రనేత మిసిర్ బెస్రా ఎన్‌కౌంటర్ ?

కలం, తెలంగాణ బ్యూరో : మావోయిస్టు పార్టీ అగ్రనేత, కేంద్రకమిటీ సభ్యుడు మిసిర్ బెస్రా జార్ఖండ్‌లోని వెస్ట్ సింగ్‌భూమ్ జిల్లా చైబాసా పరిధిలోని సరందా అటవీ ప్రాంతంలో పోలీసు భద్రతా బలగాలతో జరిగిన కాల్పుల్లో మృతి చెందినట్లు వార్తలు వస్తున్నాయి. కానీ భద్రతా బలగాలు మాత్రం దీనిపై ఇంకా క్లారిటీ ఇవ్వలేదు. మావోయిస్టు సీనియర్ నేతలంతా సమావేశమవుతున్నట్లు సమాచారం అందుకుని కూంబింగ్ చర్యలు చేపట్టామని, తొలుత మావోయిస్టుల నుంచి కాల్పులు ప్రారంభం కాగా ఆత్మరక్షణ కోసం ఎదురుకాల్పులు జరపాల్సి వచ్చిందని మాత్రం వివరణ ఇచ్చారు. ఛోటా నగ్రా పోలీసు స్టేషన్ పరిధిలోని మరాంగ్ పొంగా, బాలిబా గ్రామాల మధ్య ఉన్న దట్టమైన అటవీ ప్రాంతంలో ఉదయమే ఎదురుకాల్పులు మొదలయ్యాయని, రాత్రి వరకూ కొనసాగుతూనే ఉన్నాయని భద్రతా బలగాలు తెలిపాయి. మిసిర్ బెస్రా మృతి చెంది ఉండొచ్చని సంకేతాలు ఇచ్చినా ధృవీకరించలేదు.

మృతులు, క్షతగాత్రులపై అందని వివరాలు :

దట్టమైన అటవీ ప్రాంతంలో మావోయిస్టులు, భద్రతా బలగాల మధ్య కాల్పులు గంటల తరబడి కొనసాగుతూ ఉండడంతో ఎటువైపు ఎవరు చనిపోయారో లేక గాయపడ్డారో పూర్తి స్థాయిలో వివరాలు అందడంలేదని జార్ఖండ్ పోలీసు వర్గాలు పేర్కొన్నాయి. మిసిర్ బెస్రా మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీ సభ్యుడే అయినా ఆయన కదలికలన్నీ సరందా ఫారెస్టు ప్రాంతంలోనే ఉంటాయని ‘కోబ్రా’ విభాగం పోలీసు అధికారి ఒకరు తెలిపారు. మిసిర్ బెస్రాపై జార్ఖండ్ ప్రభుత్వం కోటి రూపాయల రివార్డు గతంలోనే ప్రకటించింది. మోస్ట్ వాంటెడ్‌గా ఉన్నందున ఆయన కదలికలపై గత కొంతకాలంగా నిఘా వేసిన ‘కోబ్రా’ బలగాలు, జార్ఖండ్ రాష్ట్రానికి చెందిన ‘జాగ్వార్’ బలగాలు, జిల్లా పోలీసులు కలిపి జాయింట్ ఆపరేషన్ చేపట్టినట్లు మాత్రం వివరించారు. నిత్యం నిఘా కొనసాగుతుండడంతో మిసిర్ బెస్రా తరచూ క్యాంపులు మారుస్తూ ఉన్నారని వ్యాఖ్యానించారు. ప్రాథమికంగా నలుగురు మావోయిస్టులు మరణించినట్లు సమాచారం అందినా పూర్తి స్థాయిలో కాల్పులు ఆగిపోయిన తర్వాత మాత్రమే వివరాలు సమగ్రంగా తెలుస్తాయన్నారు. ఇప్పటివరకు మృతదేహాలేవీ కనిపించలేదన్నారు. అటవీ ప్రాంతంలోని క్లిష్టమైన భౌగోళిక పరిస్థితుల్లో ప్రతికూల వాతావరణ, ఉన్నదని, కోబ్రా విభాగంలో మాత్రం ఒక జవాన్‌కు గాయాలయ్యాయని, వెంటనే చికిత్స కోసం రాంచీకి పంపుతున్నామని తెలిపారు. ఎయిర్ అంబులెన్స్ కోసం ఎదురుచూస్తున్నామన్నారు.

నిఘా వర్గాల నుంచి అందిన సమాచారం ప్రకారం మిసిర్ బెస్రా ఆ ప్రాంతంలోనే ఉన్నారని తెలిపారు. ఆయనతో పాటు జార్ఖండ్‌కు చెందిన మోచు, సాగెన్ అంగారియా, అశ్విన్ తదితర సీనియర్ లీడర్లు ఉన్నారన్న ప్రాథమిక సమాచారం లభ్యమైందన్నారు. సెర్చ్ ఆపరేషన్ తర్వాతనే పూర్తి వివరాలు అందుతాయన్నారు. ఆయుధాలు కూడా ఇప్పటివరకూ భద్రతా బలగాలకు స్వాధీనం కాలేదన్నారు. ఇదిలా ఉండగా కేంద్ర కమిటీ సభ్యుల్లో గణపతి, మిసిర్ బెస్రా, తెలంగాణకు చెందిన నరహరి మాత్రమే అజ్ఞాతంలో ఉన్నారని తెలంగాణ డీజీపీ వారం రోజుల క్రితం ప్రకటించిన సంగతి తెలిసిందే. సిద్దిపేట జిల్లాకు చెందిన రంగబోయిన భాగ్య కూడా అండర్‌గ్రౌండ్‌లోనే ఉన్నారని చెప్పిన నాలుగు రోజుల వ్యవధిలోనే ఆమె చత్తీస్‌గఢ్‌లోని కాంకేర్ జిల్లాలో సోమవారం జరిగిన ఎన్‌కౌంటర్‌లో మృతి చెందార. ఇప్పుడు మిసిర్ బెస్రా జార్ఖండ్ అటవీ ప్రాంతంలోని ఎన్‌కౌంటర్‌లో చనిపోయినట్లు వార్తలు వెలువడుతున్నా గురువారం ఉదయానికి స్పష్టత వచ్చే అవకాశమున్నది.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>