Mobile Popup Ad
Mobile Popup Ad

ఖమ్మంలో హీట్‌వేవ్‌పై మంత్రి పొంగులేటి సమీక్ష!

కలం, ఖమ్మం బ్యూరో: ఉమ్మడి ఖమ్మం (Khammam) జిల్లాలో పగటి ఉష్ణోగ్రతలు రికార్డు స్థాయిలో 45 డిగ్రీల మార్కును దాటిపోవడంతో అటు ప్రజలు, ఇటు అడవుల్లోని వన్యప్రాణులు, పక్షులు, పెంపుడు జీవాలు ఊపిరాడని స్థితికి చేరుకున్నాయి. భద్రాద్రి కొత్తగూడెం (Bhadradri Kothagudem) జిల్లా చుంచపల్లిలో ఏకంగా 46.4 డిగ్రీల అత్యధిక ఉష్ణోగ్రత నమోదైంది. బొగ్గు గనులు, కార్మిక క్షేత్రాల నుంచి వస్తున్న విపరీతమైన వేడి, ఉక్కపోత తోడవడంతో వాతావరణం కాక పుట్టిస్తోంది. ఈ ఎండల ధాటికి తాళలేక గడిచిన మూడు రోజుల నుంచి ఉమ్మడి ఖమ్మం జిల్లా వ్యాప్తంగా వేర్వేరు ప్రాంతాలలో సుమారు తొమ్మిది మంది వడదెబ్బకు గురై ప్రాణాలు కోల్పోవడం తీవ్ర ఆందోళన కలిగిస్తోంది.

​ఈ తీవ్ర పరిస్థితులపై రాష్ట్ర ప్రభుత్వం హై అలర్ట్ ప్రకటించింది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశాల మేరకు వడదెబ్బతో మరణించిన వారి కుటుంబాలకు రూ. 4 లక్షల చొప్పున ఆర్థిక సహాయం (ఎక్స్‌గ్రేషియా) అందించనున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది. ఉమ్మడి ఖమ్మం జిల్లాలో ‘రెడ్ అలర్ట్’ వాతావరణం ఉన్నందున మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి (Minister Ponguleti Srinivasa Reddy) ఉన్నతాధికారులతో అత్యవసర సమీక్ష నిర్వహించారు. ప్రజల ప్రాణ రక్షణే ప్రభుత్వ తొలి ప్రాధాన్యమని, ఒక్క ప్రాణం కూడా కోల్పోకూడదని ఆయన స్పష్టం చేశారు. జిల్లా కలెక్టర్లు నిరంతరం అప్రమత్తంగా ఉంటూ, ఎండ తీవ్రతపై ప్రజలకు గంట గంటకు హెచ్చరికలు జారీ చేయాలని, ఆసుపత్రుల్లో ఎండదెబ్బ కేసుల కోసం ప్రత్యేక ఏర్పాట్లు చేయాలని మంత్రి ఆదేశించారు.

​మరోవైపు ఖమ్మం జిల్లా కు చెందిన బీఆర్ఎస్ పార్లమెంటరీ పార్టీ డిప్యూటీ లీడర్, ఎంపీ వద్దిరాజు రవిచంద్ర (Vaddiraju Ravichandra) కూడా ప్రజలు అత్యంత అప్రమత్తంగా ఉండాలని పిలుపునిచ్చారు. సూర్యుడి ప్రతాపం రేపటి నుంచి మరింత పెరిగే అవకాశాలు ఉన్నాయని వాతావరణ కేంద్రం పేర్కొన్న విషయాన్ని గుర్తు చేశారు. అత్యవసరమైతే తప్ప ఉదయం 11 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు ఇళ్ల నుంచి బయటకు రావొద్దని సూచించారు. చిన్నపిల్లలు, వృద్ధులు, గర్భిణీలు తగు జాగ్రత్తలు పాటిస్తూ మంచినీళ్లు, మజ్జిగ ఎక్కువ తీసుకోవాలని సూచించారు. వ్యవసాయ, నిర్మాణ కార్మికులు, చిరు వ్యాపారులు మరింత జాగ్రత్తగా ఉండాలని, వడదెబ్బ తగిలినట్టయితే వెంటనే సమీపాన ఉన్న ఆస్పత్రికి వెళ్లి వైద్య సాయం పొందాలని ఎంపీ రవిచంద్ర సలహానిచ్చారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>