కలం, తెలంగాణ బ్యూరో : దక్షిణాది రాష్ట్రాల్లో బియ్యం ధరలు (Rice Prices) భారీ స్థాయిలో పెరుగుతుండడంతో నియంత్రణా చర్యలపై కేంద్రం దృష్టిసారించింది. ఇప్పటికే రాష్ట్రంలోని సివిల్ సప్లైస్ విభాగం బ్లాక్ మార్కెట్ చేస్తున్న దుకాణాలపై, అక్రమంగా నిల్వ చేసిన గోదాములపై సోదాలు నిర్వహిస్తున్నది. ఎక్కువ ధరకు అమ్ముతున్న వ్యాపారులపై కేసులు నమోదు చేస్తున్నది. తప్పుడు తూకాలతో విక్రయిస్తున్న షాపుల లైసెన్సుల్ని రద్దు చేస్తున్నది. దీనికి కొనసాగింపుగా కేంద్ర ప్రభుత్వం సైతం కఠిన నిబంధనలు విధించింది.
బియ్యం వ్యాపారం చేస్తున్న హోల్‌సేల్, రిటైల్ ట్రేడర్లు, మిల్లర్లు, ప్రాసెసింగ్ సంస్థలు, బిగ్ చైన్ రిటైలర్లు తప్పనిసరిగా ప్రతీ శుక్రవారం వారి దగ్గర ఉన్న స్టాక్ వివరాలను ప్రత్యేక వెబ్సైట్లో నమోదు చేయాల్సిందేనని సర్క్యులర్ జారీచేసింది. బియ్యం వ్యాపారం చేసే ప్రతీ దుకాణం పోర్టల్‌లో రిజిస్టర్ చేసుకోవాల్సిందేనని స్పష్టం చేసింది. పరిమితికి మించి నిల్వలున్నట్లు తేలినా, వ్యాపారం చేస్తూ పోర్టల్‌లో రిజిస్ట్రేషన్ చేసుకోకపోయినా కఠిన చర్యలు తీసుకోవాల్సి వస్తుందని హెచ్చరించింది. వీరిపై చర్యలు తీసుకునే అధికారాన్ని రాష్ట్ర ప్రభుత్వానికి అప్పగించింది. వచ్చే సంవత్సరం జనవరి 31 వరకు ఈ నిబంధనలు అమల్లో ఉంటాయని కేంద్రం తాజా ఉత్తర్వుల్లో స్పష్టం చేసింది.
దేశవ్యాప్తంగా ఇదే విధానం
తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, కర్నాటక, తమిళనాడు, కేరళం రాష్ట్రాల్లోనే బియ్యం ధరలు గణనీయంగా పెరుగుతుండడాన్ని కేంద్ర ప్రభుత్వం సీరియస్‌గా తీసుకున్నది.
ఏ వెరైటీ బియ్యం ఎంత స్టాక్ ఉన్నదో ప్రతీ వారం వ్యాపారులు అప్లోడ్ చేసే వివరాలను సంబంధిత అధికారులు సమీక్షించనున్నారు. రిజిస్ట్రేషన్ చేసుకోకుండానే వ్యాపారం చేసేవారిపై నిత్యావసర వస్తువుల నియంత్రణ (నిరోధక) చట్టం కఠిన చర్యలకు వెనకాడొద్దని రాష్ట్రాలకు స్పష్టం చేసింది. రాష్ట్ర పౌరసరఫరాల శాఖ ప్రస్తుతం చేపట్టిన చర్యలకు తోడు కేంద్రం నుంచి కూడా కఠిన నిబంధనలు అమల్లోకి రావడంతో రానున్న రోజుల్లో ఏ మేరకు ధరలు నియంత్రణలోకి వస్తాయో వేచి చూడాలి. అన్ని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలు ప్రతీ శుక్రవారం బియ్యం నిల్వల వివరాలను అప్లోడ్ చేయాల్సిందేనని కేంద్ర ఆహార ప్రజాపంపిణీ మంత్రిత్వశాఖ స్పష్టం చేసింది.
ఓపెన్ మార్కెట్లో డబుల్ స్థాయిలో నిల్వలు
ఓపెన్ మార్కెట్లో సాధారణంగా 25 లక్షల టన్నుల బియ్యాన్ని మాత్రమే విక్రయానికి విడుదల చేయడం ఆనవాయితీ అయినా ఈసారి దాన్ని రెట్టింపు చేసి ప్రజలకు 50 లక్షల టన్నులను అందుబాటులో ఉంచాలన్న ఉద్దేశంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఆ మంత్రిత్వశాఖ ఒక ప్రకటనలో పేర్కొన్నది. గతేడాది ఇదే సమయానికి 11 లక్షల టన్నులు మాత్రమే ఈ-వేలం ద్వారా అమ్ముడుపోయాయని, కానీ ఈసారి ఇప్పటికే పాతిక లక్షల టన్నులు దాటిందని గుర్తుచేసింది. ప్రజలకు ఇబ్బంది లేకుండా ఈ ఐదు దక్షిణాది రాష్ట్రాల్లో కేంద్రీయ భాండార్ ద్వారా, ‘నాఫెడ్’ ద్వారా, ఎన్సీసీఎఫ్ ద్వారా ‘భారత్ రైస్’ పేరుతో విక్రయిస్తున్నట్లు తెలిపింది. ప్రజల డిమాండ్‌కు తగినట్లుగా సరఫరా ఉండాలన్న ఉద్దేశంతోనే ఓపెన్ మార్కెట్లో 50 లక్షల టన్నులను అందుబాటులో ఉంచుతున్నట్లు వివరించింది.
వెబ్ పోర్టల్‌లో అప్లోడ్ చేయాల్సిన బియ్యం, ధాన్యం కేటగిరీలు
బాస్మతి రైస్ (బిర్యానీకి వాడేది)
నాన్-బాస్మతి రైస్ (సాధారణ రకం మసూరి)
నాన్-బాస్మతి ప్రీమియం రైస్ (మసూరి ఫైన్ వెరైటీ లాంటివి)
పారాబాయిల్డ్ రైస్ (ఉప్పుడు బియ్యం)
బ్రోకెన్ రైస్ (నూకలు)
వడ్లు

