కలం, వెబ్ డెస్క్: చిరుధాన్యాలు (Millets) ఆరోగ్యానికి సిరిధాన్యాలు. వీటిలో ఉండే ఫైబర్, విటమిన్లు, యాంటీ ఆక్సిడెంట్లు దీర్ఘకాలిక వ్యాధుల నుండి మనల్ని కాపాడుతాయి. ముఖ్యంగా తక్కువ గ్లైసెమిక్ ఇండెక్స్ ఉండటం వల్ల ఇవి రక్తంలోని చక్కెర స్థాయిలను నియంత్రించడానికి అద్భుతంగా పని చేస్తాయి. ఈ నేపథ్యంలో, ప్రముఖ మాస్టర్ షెఫ్ కునాల్ కపూర్ ఇటీవల నాలుగు రకాల చిరుధాన్యాలతో చేసే పోషక విలువలు కలిగిన ‘మిల్లెట్ మసాలా కిచిడీ’ (Millet Masala Khichdi) రెసిపీని పరిచయం చేశారు.
ఈ వంటకాన్ని ప్రెషర్ కుక్కర్‌లో చాలా సులభంగా తయారు చేయవచ్చని ఆయన తెలిపారు. ఈ కిచిడీ కోసం ముందుగా సమాన పాళ్లలో కొర్రలు, సజ్జలు, జొన్నలు, ఊదలు తీసుకోవాలి. వీటిని శుభ్రంగా కడిగి కుక్కర్‌లో వేయాలి. వీటికి పెసర పప్పు, మసూర్ పప్పు కందిపప్పును జత చేయాలి. తగినంత ఉప్పు, పసుపు, నీరు పోసి మెత్తగా ఉడికించుకోవాలని కునాల్ వివరించారు.
కిచిడీ ఉడికేలోపు రుచికరమైన పోపును సిద్ధం చేసుకోవాలి. ఒక పాన్‌లో నెయ్యి వేసి వేడెక్కిన తర్వాత ఎండుమిర్చి, ఇంగువ, ఆవాలు, జీలకర్ర, కరివేపాకు వేసి వేయించాలి. ఆపై ఉల్లిపాయ ముక్కలు, అల్లం, వెల్లుల్లి, పచ్చిమిర్చి వేసి వేయించాలి. ఉల్లిపాయలు రంగు మారాక కొత్తిమీర, పసుపు, కారం, ఉప్పు, టమోటాలు వేసి మెత్తగా అయ్యే వరకు ఉడికించాలి.
చివరగా ఈ పోపును ఉడికించిన మిల్లెట్ మిశ్రమంలో కలపాలి. దీనికి కొద్దిగా కసూరీ మేతీ పొడి, నిమ్మరసం, కొత్తిమీర జోడిస్తే రుచికరమైన మసాలా కిచిడీ (Millet Masala Khichdi) సిద్ధమవుతుంది. షెఫ్ అందించిన ఈ చిట్కాలు పాటిస్తే రోజువారీ ఫైబర్ అవసరాలను తీర్చుకుంటూనే ఇంటిల్లిపాదికి ఆరోగ్యకరమైన భోజనాన్ని అందించవచ్చు.
Read Also: సొరకాయతో అదిరిపోయే బ్రేక్‌ఫాస్ట్ రెసిపీ..
Follow Us On: Facebook

