కలం, వెబ్‌డెస్క్: మనం హోటల్‌కు వెళ్లి బిర్యానీ తిన్నా, లేదా ఇంట్లో చేసుకుని తిన్నా.. పక్కన చల్లటి కూల్ డ్రింక్ మాత్రం పక్కా ఉండాల్సిందే! చాలా మంది బిర్యానీతో కూల్ డ్రింక్ కాంబినేషన్‌ను ఎంతో ఇష్టపడతారు. అయితే, ఈ కాంబినేషన్ వల్ల అనేక ఆరోగ్య సమస్యలు (Health Risks) తలెత్తే ప్రమాదం ఉందని ఆరోగ్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. అవేమిటో తెలుసుకుందాం.
సాధారణంగా బిర్యానీలో కొవ్వులు, కార్బోహైడ్రేట్లు, ఘాటైన మసాలాలు అధికంగా ఉంటాయి. వీటిని జీర్ణం చేసుకోవడానికి మన జీర్ణవ్యవస్థకు కొంత సమయం పడుతుంది. అయితే, బిర్యానీ తిన్న వెంటనే కూల్ డ్రింక్ తాగడం వల్ల.. దానిలోని అధిక చక్కెర, కార్బొనేషన్ ప్రభావంతో కడుపు ఉబ్బరం, అజీర్తి, గ్యాస్ వంటి అనారోగ్య సమస్యలు తలెత్తే అవకాశం ఉంది.
బిర్యానీలోని కార్బోహైడ్రేట్లు (బియ్యం) ఇప్పటికే రక్తంలో గ్లూకోజ్ స్థాయిలను పెంచుతాయి. దీనికి తోడు కూల్ డ్రింక్ ద్వారా శరీరంలోకి చేరే అదనపు చక్కెర.. రక్తంలో గ్లూకోజ్ హెచ్చుతగ్గులకు కారణమవుతుంది. ముఖ్యంగా డయాబెటిస్, ప్రీడయాబెటిస్ బాధితులలో ఇది తీవ్ర ప్రభావం చూపుతుంది కాబట్టి, వారు ఈ విషయంలో చాలా అప్రమత్తంగా ఉండాలని చెబుతున్నారు నిపుణులు.
అధిక కేలరీలు కలిగిన బిర్యానీ తిన్న తర్వాత కూల్ డ్రింక్ తాగడం వల్ల అదనపు కేలరీలు శరీరంలోకి చేరతాయి. ఈ అదనపు కేలరీల వల్ల బరువు పెరగడం, పొట్ట చుట్టూ కొవ్వు పేరుకుపోవడం వంటి సమస్యలు ఎదురయ్యే అవకాశం ఉందని చెబుతున్నారు.
సాధారణంగా బిర్యానీలో అధిక కొవ్వు ఉంటుంది. ఈ ఆహారంతో పాటు షుగర్ ఎక్కువగా ఉన్న కూల్‌డ్రింక్స్ తాగడం వల్ల దీర్ఘకాలంలో గుండె ఆరోగ్యంపై ప్రతికూల ప్రభావం పడుతుందని సూచిస్తున్నారు నిపుణులు. దీనివల్ల రక్తంలో ట్రైగ్లిజరైడ్స్ స్థాయిలు పెరగడం, మెటబాలిక్ సమస్యలు రావడం వంటి ప్రమాదాలు తలెత్తుతాయట.
బిర్యానీ వంటి భారీ భోజనం తిన్న తర్వాత కార్బన్ డైఆక్సైడ్ గ్యాస్ ఉండే కూల్ డ్రింక్స్ తాగడం మంచిది కాదట. దీనివల్ల కడుపు నిండిన భావన, ఉబ్బరం, అసౌకర్యం మరింత పెరిగే అవకాశం ఉందని చెబుతున్నారు.
చాలామంది దాహం అనిపించినపుడు కూల్ డ్రింక్ తాగుతుంటారు. దీనివల్ల దాహం తీరినట్లు అనిపించినా, అందులోని చక్కెర ఎక్కువగా ఉండటం వల్ల కొంతసేపటి తర్వాత మళ్లీ దాహం వేస్తుందట. దానికి బదులు శరీరానికి నిజంగా అవసరమైన హైడ్రేషన్‌ను ఇచ్చే నీరు లేదా మజ్జిగ వంటి ఆరోగ్యకరమైన పానీయాలు తీసుకోవడం మంచిదని సూచిస్తున్నారు నిపుణులు.
అయితే ఎప్పుడో ఒకసారి బిర్యానీతో కూల్ డ్రింక్ తీసుకోవడం పెద్ద సమస్య కాదు. కానీ ఇది తరచూ జరిగితే ఊబకాయం, ఇన్సులిన్ రెసిస్టెన్స్, ఫ్యాటీ లివర్ వంటి మెటబాలిక్ సమస్యల ప్రమాదం పెరిగే అవకాశం ఉందని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు.
బిర్యానీ తిన్న తర్వాత కూల్ డ్రింక్‌కు బదులుగా సాధారణ నీరు, మజ్జిగ, నిమ్మరసం వంటి పానీయాలను ఎంచుకోవడం ఆరోగ్యానికి మరింత మంచిది.

