కలం, నిజామాబాద్ బ్యూరో: ఉత్తర తెలంగాణ వర ప్రదాయిని శ్రీరాం సాగర్ ప్రాజెక్టు (Sriram Sagar Project) కు గురువారం రాత్రి వరకూ 75 వేల క్యూసెక్కుల భారీ వరద వచ్చింది. శుక్రవారం ఉదయానికి అది కాస్త తగ్గి 60150 క్యూసెక్కుల వరద మాత్రమే వస్తుంది. మూడు రోజులతో పోలిస్తే ఈ వరద వాస్తవానికి ఎక్కువే. మూడు రోజుల కిందట 2 వేల నుంచి 3 వేల క్యూసెక్కుల నీటి ప్రవాహం మాత్రమే వచ్చింది. మరోవైపు ఇన్ ఫ్లో తగ్గుతున్నా ప్రాజెక్టు నీటి మట్టం మాత్రం పెరిగింది. నాలుగు రోజుల్లో ప్రాజెక్టులోకి 5 నుంచి 6 TMC ల వరద రావడం చెప్పుకోదగ్గ విషయమని అధికారులు తెలిపారు.
పూర్తిస్థాయి నీటి మట్టం 1091 అడుగులు 80.5 TMC లు కాగా.. ప్రస్తుత నీటి మట్టం శుక్రవారం ఉదయం 11 గంటల సమయానికి 1069.20 అడుగులకు చేరుకుంది. అంటే 22 TMC లకు చేరుకుంది. నాలుగు రోజుల కిందట కేవలం 16 TMC ల నీటి నిల్వ ఉండేది. నాలుగు రోజుల వర్షాలతో ప్రస్తుతం 60150 క్యూసెక్కుల వరద వస్తోంది. అవుట్ ఫ్లో 822 క్యూసెక్కులుగా ఉంది. సాగు తాగు నీటి కోసం అలాగే మిషన్ భగీరథ నీటి అవసరాల కోసం విడుదల చేస్తున్నారు. వర్షాలు కంటిన్యూ అయితే వరద పెరిగే అవకాశం ఉందని చెబుతున్నారు అధికారులు.

