కలం, భూపాలపల్లి: జయశంకర్ భూపాలపల్లి జిల్లా భూపాలపల్లి ఏరియాలోని కేటీకే-5వ బొగ్గు గనిలో (Bhupalpally Coal Mine) సోమవారం పెద్ద ప్రమాదం తప్పింది. బ్లాస్టింగ్ చేస్తుండగా మందుగుండు (పూర్ణిమ) చేతిలోనే పేలింది. దీంతో శ్రీరాముల ప్రదీప్ అనే షార్ట్ ఫైరర్ కార్మికుడికి తీవ్ర గాయాలు అయ్యాయి. గని లోపల 13వ లెవెల్‌లో బొగ్గు ఉత్పత్తి కోసం బ్లాస్టింగ్ చేస్తుండగా ఈ ఘటన జరిగింది. చేతిలోనే మందుగుండు పేలడంతో ప్రదీప్ ఎడమ చేతికి తీవ్ర గాయాలు అయ్యాయి. గాయపడిన సదరు కార్మికుడిని తోటి కార్మికులు భూపాలపల్లి ఏరియా ఆస్పత్రికి తరలించారు. ప్రమాదం జరిగిన తీరుపై సింగరేణి అధికారులు విచారణ చేపట్టారు.

