కలం, వెబ్ డెస్క్: జూన్ 21న జరుగనున్న నీట్ (NEET) యూఈ రీ ఎగ్జామ్ హాల్ టికెట్లను నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (NTA) విడుదల చేసింది. అయితే ఈ హాల్ టికెట్లను డౌన్‌లోడ్ చేసుకునేటప్పుడు అభ్యర్థులు పలు సాంకేతిక సమస్యలు ఎదుర్కొంటున్నారు. దీనిపై ఎన్‌టీఏ స్పందించింది. ఇప్పటికే సుమారు 4 లక్షల మంది అభ్యర్థులు తమ అడ్మిట్ కార్డ్‌లను డౌన్‌లోడ్ చేసుకున్నారని, మిగిలిన వారు ఎదుర్కొంటున్న సాంకేతిక సమస్యలను తమ బృందం త్వరలోనే పరిష్కరిస్తుందని ఎన్‌టీఏ తన అధికారిక ఎక్స్ ఖాతా ద్వారా స్పష్టం చేసింది.
అధికారిక వెబ్‌సైట్ neet.nta.nic.in లో ఇబ్బందులు ఎదుర్కొంటున్న అభ్యర్థులు ప్రత్యామ్నాయంగా డిజిలాకర్ (Digilocker) లేదా ఉమాంగ్ (UMANG) యాప్‌ల ద్వారా కూడా తమ అడ్మిట్ కార్డ్‌లను డౌన్‌లోడ్ చేసుకోవచ్చని ఎన్‌టీఏ సూచించింది. ఇందు కోసం డిజిలాకర్ వెబ్‌సైట్ కి వెళ్లి, డాక్యుమెంట్స్ సెక్షన్‌లో నీట్ యూజీ అడ్మిట్ కార్డ్ లింక్‌పై క్లిక్ చేసి, లాగిన్ వివరాలు సమర్పించి హాల్ టికెట్ పొందవచ్చు. ఈ రీ ఎగ్జామ్ జూన్ 21న మధ్యాహ్నం 2:00 గంటల నుండి 2:15 గంటల వరకు దేశవ్యాప్తంగా 551 నగరాల్లో, అలాగే విదేశాల్లోని 14 నగరాల్లో జరగనుంది; సంతకాలు, ఇతర పరీక్షా లాంఛనాల పూర్తి చేసేందుకు ఈసారి పరీక్షా సమయాన్ని 15 నిమిషాలు పొడిగించారు. అభ్యర్థులు ఈ విషయాన్ని గమనించాలని అధికారులు సూచించారు.

