కలం, వెబ్ డెస్క్ : బీఆర్ఎస్ పార్టీకి చెందిన మాజీ ఎమ్మెల్యే రేగా కాంతారావు (Rega Kantha Rao)పై హైదరాబాద్‌లోని పంజాగుట్ట పోలీస్ స్టేషన్లో లైంగిక వేధింపుల కేసు నమోదైంది. పెళ్లి పేరుతో తనను శారీరకంగా వాడుకుని నమ్మించి మోసం చేశాడంటూ ఒక యువతి పోలీసులను ఆశ్రయించింది. బాధితురాలు ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా ఈ నెల 26వ తేదీన పంజాగుట్ట పోలీసులు రేగా కాంతారావుపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
బాధితురాలు తన ఫిర్యాదులో పలు సంచలన విషయాలను పేర్కొంది. ఉద్యోగం కోసం ఇంటర్వ్యూ పేరుతో రేగా కాంతారావు తనను ఫ్లాట్‌కు పిలిపించుకుని లైంగిక దాడికి పాల్పడ్డారని ఆరోపించింది. ఆ తర్వాత పెళ్లి చేసుకుంటానని నమ్మబలికి, మోసం చేస్తూ శారీరకంగా లొంగదీసుకున్నారని వెల్లడించింది. అంతేకాకుండా, తనకు తెలియకుండానే తన ప్రైవేట్ వీడియోలను కూడా చిత్రీకరించారని బాధితురాలు కంప్లైంట్లో వివరించింది. రియల్ ఎస్టేట్‌లో పెట్టుబడులు పెడితే మంచి లాభాలు వస్తాయంటూ నమ్మించి, తన దగ్గర నుంచి పెద్ద మొత్తంలో డబ్బులు సైతం వసూలు చేశారని ఆమె పేర్కొంది.
ఇదిలా ఉండగా, తన ఫోన్‌ను యాక్సెస్ చేసి, అందులోని కాంటాక్ట్స్ ఆధారంగా తన స్నేహితురాలికి కూడా ఇదే రీతిలో మెసేజ్‌లు పంపి ఆమెకు కూడా దగ్గరయ్యేందుకు ప్రయత్నించారని బాధితురాలు ఆవేదన వ్యక్తం చేసింది. ఈ వ్యవహారంపై బాధితురాలి ఫిర్యాదును తీవ్రంగా పరిగణించిన పంజాగుట్ట పోలీసులు మాజీ ఎమ్మెల్యే రేగా కాంతారావుపై బీఎన్ఎస్ 69 (BNS 69) తో పాటు 351 (2) సెక్షన్ల కింద కేసు నమోదు చేసి చట్టపరమైన చర్యలు ప్రారంభించారు.

