కలం, వెబ్ డెస్క్ : సిల్హెట్ టెస్టులో పాకిస్తాన్ స్టార్ పేసర్ హసన్ అలీకి భయంకర గాయం (Hasan Ali Injury) కావడంతో ఒక్కసారిగా ఆందోళన నెలకొంది. మైదానంలో బలంగా పడిపోయిన ఆయనను స్ట్రెచర్‌పై బయటకు తీసుకెళ్లాల్సి వచ్చింది. కానీ కాసేపటికే మళ్లీ గ్రౌండ్‌లోకి రావడంతో పాకిస్తాన్ జట్టు ఊపిరి పీల్చుకుంది. బంగ్లాదేశ్‌తో జరుగుతున్న రెండో టెస్టులో టాస్ గెలిచిన పాకిస్తాన్ ముందుగా బౌలింగ్ ఎంచుకుంది. ఇన్నింగ్స్ ఎనిమిదో ఓవర్‌లో తంజీద్ హసన్ తమీమ్ ఆడిన షాట్‌ను క్యాచ్ పట్టేందుకు హసన్ అలీ ముందుకు దూకాడు. అయితే బ్యాలెన్స్ తప్పి బలంగా నేలపై పడిపోయాడు.
గాయంతో నొప్పితో బాధపడుతున్న హసన్ అలీని చూసి వెంటనే మెడికల్ టీమ్ మైదానంలోకి వచ్చింది. పరిస్థితి తీవ్రంగా కనిపించడంతో స్ట్రెచర్‌పై ఆయనను బయటకు తరలించారు. దీంతో పాకిస్తాన్ ఆటగాళ్లు, అభిమానుల్లో టెన్షన్ పెరిగింది. అయితే ఊహించని విధంగా కొద్దిసేపటికే హసన్ అలీ తిరిగి మైదానంలోకి అడుగుపెట్టాడు. 15వ ఓవర్‌లో ఫీల్డింగ్‌కు వచ్చిన ఆయన.. 19వ ఓవర్ నుంచి మళ్లీ బౌలింగ్ కూడా ప్రారంభించాడు. దీంతో గాయం పెద్దది కాదని స్పష్టమైంది. మరోవైపు మహ్మద్ అబ్బాస్ అద్భుత బౌలింగ్‌తో రెండు వికెట్లు పడగొట్టగా.. లంచ్ సమయానికి బంగ్లాదేశ్ 101/3తో నిలిచింది.

