కలం, నిజామాబాద్ బ్యూరో: నిజామాబాద్ (Nizamabad) జిల్లా కేంద్రంలో హర్యానా దొంగల ముఠా (Haryana Thieves) హల్చల్ సృష్టించింది.. అర్ధరాత్రి దొంగలు ఆలయంలో దోపిడీకి యత్నించారు. నగరంలోని హమాల్ వాడి ప్రాంతంలోని సాయిబాబా ఆలయంలోకి ఆదివారం అర్ధరాత్రి ముగ్గురు దొంగలు చొరబడ్డారు. హుండీతో పాటు ఇతర నగలను దొంగిలించేందుకు ప్రయత్నించారు. తమ వెంట తెచ్చుకున్న ఇనుప రాడ్డు, సుత్తితో ఆలయం డోర్లను ధ్వంసం చేస్తుండగా భారీగా శబ్దాలు వచ్చాయి. దీంతో ఆలయం చుట్టుపక్కల ఇళ్లల్లో ఉన్నవారు మేల్కొని వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. మూడో టౌన్ ఎస్సై హరిబాబు, నైట్ పెట్రోలింగ్ సిబ్బంది హుటాహుటిన ఆలయం వద్దకు చేరుకున్నారు. పోలీసులను చూసి దొంగల ముఠా పారిపోయేందుకు ప్రయత్నించారు. అయితే ఆ దొంగలను పోలీసులు పట్టుకున్నట్లు తెలిసింది. ఈ చోరీ ఘటనపై సాయిబాబా ఆలయ పూజారి కృష్ణమాచారి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

