కలం, వెబ్‌డెస్క్: పొద్దున లేచింది మొదలు టీవీల్లో, పేపర్లలో దొంగతనాలు, దోపిడీల వార్తలు చదువుతూనే ఉంటాం. దొంగలంటే ఇంట్లో ఉన్న నగలు, డబ్బు కాజేసి పారిపోతారు. ఇవన్నీ కామన్.. కానీ, ఎక్కడైనా మంచి దొంగల గురించి విన్నారా? దొంగల్లో మంచి దొంగలు కూడా ఉంటారా? అని ఆశ్చర్యపోకండి.. కాకినాడ (Kakinada) జిల్లాలో జరిగిన గటన గురించి తెలిస్తే నిజమే అంటారు. దొంగిలించిన డబ్బు, నగదు మళ్లీ రిటర్న్ ఇచ్చేసిన విచిత్ర ఘటన ఏపీలోని కాకినాడలో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళ్తే.. కాకినాడ జిల్లా కరప (Karapa) లో జూలై 18న నామాల గణేష్ ఇంట్లో చోరీ జరిగింది. ఇంట్లో ఎవరూ లేని సమయంలో వచ్చిన దొంగలు నగలు, రూ.50 డబ్బుతో పరారయ్యారు.
ఇంటికి వచ్చి చూసిన గణేష్ కుటుంబసభ్యులు చోరీ విషయాన్ని గుర్తించి పోలీసులకు ఫిర్యాదు చేశారు. అయితే తాజాగా ఈ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. స్వయంగా ఆ దొంగలే చోరీ చేసిన నగలు, రూ.28 వేల డబ్బును ఓ సంచిలో పెట్టి గణేష్ ఇంటి ఆవరణలో వదిలి వెళ్లారు. అందులో ఓ లేఖ కూడా పెట్టారు. “మేం చేసింది తప్పే, వాడేసిన రూ.22 వేలు ఇవ్వలేము.. క్షమించండి” అంటూ లేఖలో పేర్కొన్నారు. ఇక కొంత డబ్బు పోయినా నగలు తిరిగి వచ్చాయని గణేష్ కుటుంబం సంతోషపడుతోంది. అయితే పోలీసుల విచారణలో మరో ఆసక్తికర విషయం వెలుగులోకి వచ్చింది. గణేష్ బంధువులే ఈ చోరీకి పాల్పడినట్లు తేలింది. దీంతో గ్రామ పెద్దల సమక్షంలో ఈ విషయాన్ని తేల్చుకోవడానికి పంచాయితీ నడుస్తోంది. ఈ విషయం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఏదేమైనా అందినకాడికి దోచుకునే దొంగల్ని చూశాం కానీ, ఇలాంటి మంచి దొంగలు కూడా ఉంటారా? అని నెటిజన్లు ఆశ్చర్యపోతున్నారు.

