కలం మెదక్ బ్యూరో: నిరుద్యోగులు నోటిఫికేషన్ల కోసం ఎదురు చూస్తుంటే.. తాము వేస్తామంటున్నా నిరుద్యోగులే వద్దంటున్నారంటూ సీఎం రేవంత్ రెడ్డి బుకాయిస్తున్నారని మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీశ్ రావు (Harish Rao) మండిపడ్డారు. అధికారం కోసం నిరుద్యోగులను నమ్మించి మోసం చేశారని ఫైర్ అయ్యారు. తక్షణమే జాబ్ నోటిఫికేషన్ విడుదల చేసి రెండు లక్షల ఉద్యోగాలు భర్తీ చేయకపోతే, నిరుద్యోగులతో సెక్రటేరియట్‌ను ముట్టడిస్తామని హరీష్ రావు హెచ్చరించారు. సిద్దిపేట జిల్లా గ్రంథాలయంలో ఉద్యోగాలకు ప్రిపేరవుతున్న నిరుద్యోగులతో మాట్లాడారు. రాహుల్ గాంధీని అశోక్ నగర్ సెంట్రల్ లైబ్రరీకి తీసుకొచ్చి మొదటి ఏడాదిలోనే 2 లక్షల ఉద్యోగాలని నమ్మించారని విమర్శించారు. అధికారంలోకి వచ్చాక అదే సెంట్రల్ లైబ్రరీలో పోలీసులను పెట్టి నిరుద్యోగులపై రేవంత్ రెడ్డి దాడి చేయిస్తున్నాడని ధ్వజమెత్తారు.
‘ఇచ్చింది కేవలం 16 వేల ఉద్యోగాలు మాత్రమే..’
బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో 1.60 లక్షల ఉద్యోగాలు భర్తీ చేశామని , కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక భర్తీ చేసింది కేవలం 16 వేల ఉద్యోగాలని సీఎం రేవంత్ అసెంబ్లీలో చెప్పారని హరీశ్ రావు గుర్తు చేశారు. ఇచ్చిన హమీ ప్రకారం మిగిలిన 1.84 లక్షల ఉద్యోగాలు ఎప్పుడు భర్తీ చేస్తారో సీఎం సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. పోలీస్ శాఖలో 19 వేల ఉద్యోగాలు ఖాళీలు ఉన్నాయని డీజీపీ చెబుతుంటే.. 5 వేల ఉద్యోగాలకే ప్రభుత్వం అనుమతి ఇచ్చిందన్నారు. మిగతా 14 వేల పోస్టులకు నోటిఫికేషన్ ఇవ్వకుండా ఎందుకు ఆపుతున్నారని ప్రశ్నించారు. విద్యా కమిషన్ రిపోర్ట్ ని సీఎం రేవంత్ రెడ్డి ఎందుకు బయటపెట్టడం లేదన్నారు. రాష్ట్రంలో 30 వేల ఉపాధ్యాయ పోస్టులు ఖాళీలున్నా.. డీఎస్సీ ఇంకా వేయడం లేదన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రావడానికి దోహదపడిన నిరుద్యోగులే.. రేపు రేవంత్ రెడ్డిని బొంద పెడుతారని ఘాటుగా హెచ్చరించారు.

