బీసీలకు 42శాతం రిజర్వేషన్లకు బీజేపీ, కాంగ్రెస్ మద్దతు ప్రకటించాక దానిని ఆపే వాళ్లు ఎవరున్నారని మాజీ మంత్రి హరీష్ రావు(Harish Rao) వ్యాఖ్యానించారు. కేంద్రంలో బీజేపీ(BJP) అధికారంలో ఉందని, తెలంగాణలో కాంగ్రెస్(Congress) అధికారంలో ఉందని, ఇద్దరూ మద్దతు అంటే స్టేట్‌లో సెంట్రల్‌లో లైన్ క్లియర్ అయినట్టే కదా? అని అన్నారు. అధికారం చేతిలో ఉన్నా ఈ రెండు పార్టీలు కూడా బీసీలను మభ్యపెట్టి పబ్బం గుడుపుకుంటున్నాయని విమర్శలు చేశారు. పార్లమెంట్‌లో బీజేపీ బలం 240 స్థానాలు, కాంగ్రెస్ బలం 99 స్థానాలు.. ఈ రెండు పార్టీలు తలుచుకుంటే బీసీ రిజర్వేషన్లు ఇట్టే అమలవుతాయని అన్నారు.
కానీ, రిజర్వేషన్లపై(BC Reservations) ఢిల్లీలో కోట్లాడాల్సిన రెండు జాతీయ పార్టీల నాయకులు గల్లీలో డ్రామాలు ఆడుతున్నారని చురకలంటించారు. 70ఏళ్ల పాలనలో కాంగ్రెస్ మొత్తం ఆరుసార్లు జనాభా లెక్కింపు చేయించిందని, కానీ ఒక్కసారి కూడా బీసీ గణన చేయలేదని గుర్తు చేశారు. ఇక బీజేపీ అయితే బీసీ గణనను నాలుగేళ్లు వాయిదా వేస్తూ వస్తోందన్నారు. ఇప్పుడు రాజకీయ లబ్ది కోసమే బీజేపీ, కాంగ్రెస్ రెండూ కూడా ఒకరిని మించి ఒకరు బీసీలపై ప్రేమ ఒలకబోస్తున్నారని, ఇప్పటికైనా గల్లీలో డ్రామాలు కట్టిపెట్టి.. ఢిల్లీ వేదికగా బీసీ రిజర్వేషన్ల పెంపు కోసం పోరాటం మొదలు పెట్టాలని కాంగ్రెస్, బిజెపి లను Harish Rao డిమాండ్ చేశారు.

