కలం, వెబ్ డెస్క్: ఏపీ చేపట్టిన పల్నాడు వాటర్ గ్రిడ్ ప్రాజెక్టు(Palnadu Water Grid Project)ని హైదరాబాద్లో జరిగిన కేఆర్ఎంబీ సమావేశంలో తెలంగాణ ప్రభుత్వం కనీసం ప్రస్తావించకపోవడాన్ని బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీశ్ రావు (Harish Rao) తప్పుబట్టారు. తెలంగాణకు సీఎం రేవంత్ రెడ్డి చేస్తున్న జల ద్రోహానికి ఇంతకు మించిన సాక్ష్యం ఏం ఉంటుందన్నారు. చంద్రబాబు అడుగులకు మడుగులొత్తే రేవంత్ రెడ్డి.. తెలంగాణ ప్రయోజనాలను తాకట్టు పెట్టి ఏపీకే పెద్ద పీట వేస్తున్నారని మండిపడ్డారు.
నాగార్జున సాగర్ జలాలను తరలించేలా అక్రమంగా నిర్మిస్తున్న పల్నాడు వాటర్ ప్రాజెక్టును అడ్డుకునేందుకు ఎందుకు ప్రయత్నించలేదని హరీశ్ రావు ప్రశ్నించారు. దీనిపై తెలంగాణ ప్రజలకు రేవంత్ రెడ్డి సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. గతంలో ఢిల్లీలో జరిగిన సమావేశంలో బనకచర్ల ప్రాజెక్టును ప్రస్తావించలేదని, ఇప్పుడు కేఆర్ఎంబీ (KRMB) సమావేశంలో వాటర్ గ్రిడ్ ప్రాజెక్టును ప్రశ్నించలేదని హరీశ్ రావు ఆగ్రహం వ్యక్తం చేశారు.
తెలంగాణకు ఎవరు రక్షకులు..?
తెలంగాణ నీటి హక్కులు కాపాడాల్సిన సీఎం రేవంత్ రెడ్డి.. ఏపీకి లొంగిపోయి, ఆ రాష్ట్రానికి సంపూర్ణంగా సహకరిస్తున్నారని హరీశ్ రావు (Harish Rao) స్పష్టం చేశారు. అలాంటప్పుడు తెలంగాణ ప్రయోజనాలకు రక్షకులు ఎవరని ఆందోళన వ్యక్తం చేశారు. మేధావులు, తెలంగాణ వాదులు ఇకనైనా ఆలోచించాలని కోరారు. కేఆర్ఎంబీ సమావేశంలో పల్నాడు ప్రాజెక్ట్ ప్రస్తావన రాలేదని ఏపీ అధికారులు చెబుతున్నారని.. గట్టిగా నిలదీశామని ప్రచారం చేసుకుంటున్నవారు ఇప్పుడేం సమాధానం చెబుతారన్నారు. నీళ్ల విషయంలో ఎప్పుడైనా తెలంగాణకు ద్రోహం చేసింది, చేస్తోంది కాంగ్రెస్ పార్టీ మాత్రమే అన్నారు. తెలంగాణ ప్రయోజనాలను తాకట్టు పెట్టి రేవంత్ చేస్తున్న మోసాన్ని ప్రజలు క్షమించబోరని వివరించారు.
Also Read : యాదాద్రి భక్తులకు ముఖ్య గమనిక.. పూజా వేళల్లో భారీ మార్పులు!
Follow Us On: Youtube

