మహిళలపై హింసను అరికట్టడంలో ప్రభుత్వాలు విఫలం: మల్లు లక్ష్మి

కలం, నల్గొండ: అంతర్జాతీయ మహిళలపై హింస నిర్మూలన దినోత్సవం సందర్భంగా ఐద్వా నాయకురాలు కొండ అనురాధ ఆధ్వర్యంలో నల్గొండలోని మహాత్మా జ్యోతిబా పూలే పాఠశాల, కళాశాలలో బుధవారం అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ  సందర్బంగా ఐద్వా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మల్లు లక్ష్మి (AIDWA Leader Mallu Lakshmi) మాట్లాడారు. మహిళలపై రోజురోజుకూ పెరుగుతున్న హింస, లైంగిక వేధింపులు, అత్యాచారాలు, హత్యలను అరికట్టడంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు విఫలమవుతున్నాయని విమర్శించారు. మహిళలపై హింస వ్యక్తిగత సమస్య కాదని, లింగ వివక్ష, అసమానతలు, పితృస్వామ్య భావజాలం ఫలితమన్నారు.

NCRB గణాంకాల ప్రకారం 2024లో దేశవ్యాప్తంగా 29,536 అత్యాచార కేసులు, మహిళలపై మొత్తం 4,41,534 నేరాలు నమోదయ్యాయని మల్లు లక్ష్మి తెలిపారు. ప్రతి 18 నిమిషాలకు ఒక అత్యాచార కేసు నమోదవుతున్న పరిస్థితి మహిళల భద్రత ఎంత ప్రమాదంలో ఉందో తెలియజేస్తోందన్నారు. నేరాలు జరిగిన తర్వాత స్పందించడం కాకుండా ముందస్తు నివారణ చర్యలు చేపట్టాలని డిమాండ్ చేశారు. నిందితులకు రాజకీయ అండ లేకుండా కఠిన చర్యలు తీసుకోవాలని, బాధితులకు సత్వర న్యాయం అందించాలని కోరారు.

మహిళలకు భద్రత అంటే కేవలం రక్షణ కాదని, విద్య, ఉపాధి, ఆర్థిక స్వావలంబన, సామాజిక గౌరవం, రాజకీయ భాగస్వామ్యం కల్పించడమేనని లక్ష్మి స్పష్టం చేశారు. చట్టసభల్లో 33 శాతం మహిళా రిజర్వేషన్లను తక్షణమే అమలు చేయాలని డిమాండ్ చేశారు. ఐద్వా జిల్లా ప్రధాన కార్యదర్శి పాలడుగు ప్రభావతి మాట్లాడుతూ విద్యాసంస్థల్లో బాల్యం నుంచే లింగ సమానత్వం, పరస్పర గౌరవం, మహిళల హక్కులు, రాజ్యాంగ విలువల గురించి బోధించాలని సూచించారు. నవంబర్ 25 నుంచి డిసెంబర్ 10 వరకు దేశవ్యాప్తంగా 16 రోజులపాటు అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని తెలిపారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>