కలం, బాసర: బాసర శ్రీ జ్ఞాన సరస్వతి అమ్మవారి ఆలయ అభివృద్ధి పనులు, రానున్న గోదావరి పుష్కరాల ఏర్పాట్లను దేవాదాయ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ శైలజ రామయ్యర్ (Shailaja Ramaiyer) , రాష్ట్ర దేవాదాయ శాఖ కమిషనర్ హనుమంతరావు బుధవారం జిల్లా కలెక్టర్ భవేష్ మిశ్రాతో కలిసి క్షేత్రస్థాయిలో పరిశీలించారు. గోదావరి నది తీరంలోని పుష్కర స్నాన ఘాట్‌ను సందర్శించారు.
పుష్కరాల సందర్భంగా దేశంలోని వివిధ ప్రాంతాల నుంచి తరలివచ్చే భక్తులకు అవసరమైన సౌకర్యాలు, ఘాట్ అభివృద్ధి పనులు, భక్తుల రాకపోకలకు కల్పించాల్సిన ఏర్పాట్లపై అధికారులను అడిగి వివరాలు తెలుసుకున్నారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ముందస్తు ప్రణాళికతో అవసరమైన మౌలిక సదుపాయాలు కల్పించాలని సూచించారు. అనంతరం బాసర శ్రీ జ్ఞాన సరస్వతి అమ్మవారి ఆలయాన్ని సందర్శించి, నూతనంగా చేపడుతున్న ఆలయ అభివృద్ధి, నిర్మాణ పనులను పరిశీలించారు. ఆలయ గోపుర నిర్మాణానికి సంబంధించి శిలా స్థాపన కార్యక్రమంలో పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు.
అనంతరం నిర్మాణ పనులను ప్రారంభించారు. ఈ సందర్భంగా శ్రీ జ్ఞాన సరస్వతి అమ్మవారిని దర్శించుకొని ప్రత్యేక పూజలు చేశారు. ఆలయ ప్రాంగణంలో చేపడుతున్న నూతన మండపం, గోపుర నిర్మాణ పనుల పురోగతిని సంబంధిత అధికారులను అడిగి తెలుసుకున్నారు. నిర్మాణ ప్రణాళికలు, పనుల నాణ్యత, ఇప్పటివరకు పూర్తయిన పనులు, తదుపరి చేపట్టాల్సిన కార్యక్రమాలపై సమీక్షించారు. ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ బి. వెంకటేశ్వర్లు, ఆలయ ఈఓ అంజనీదేవి తదితరులు పాల్గొన్నారు.

