కలం, నాగార్జునసాగర్: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, మంత్రులు పాలనను గాలికి వదిలేసి ఢిల్లీ పర్యటనలకే ప్రాధాన్యత ఇస్తున్నారని మాజీ మంత్రి హరీశ్ రావు (Harish Rao) తీవ్రంగా విమర్శించారు. గుర్రంపోడు మండలం జూనూతల వద్ద ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని సందర్శించి ఆయన రైతులతో మాట్లాడారు. రైతుల సంక్షేమం కంటే కుర్చీని కాపాడుకోవడం, ఢిల్లీకి కప్పం కట్టడంపైనే ప్రభుత్వానికి ప్రేమ ఉందని ఆరోపించారు. రాష్ట్రంలో ధాన్య కొనుగోలు ప్రక్రియ అస్తవ్యస్తంగా తయారైందని, 46 డిగ్రీల ఎండలో రైతులు కొనుగోలు కేంద్రాల వద్ద పడిగాపులు కాస్తున్నారని మండిపడ్డారు. కనీసం తాగడానికి నీళ్లు, ఎండ నుండి రక్షణకు టెంట్లు కూడా ఏర్పాటు చేయలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రైతులకు అందాల్సిన రైతు బంధు నిధులను సరిగ్గా పంపిణీ చేయలేదని మండిపడ్డారు. అనేకమంది రైతులకు మొండిచేయి చూపారని విమర్శించారు.
ఐకేపీ కేంద్రాల్లో కొనుగోలు చేసిన వడ్లను రైస్ మిల్లుల్లో దించుకోవడం లేదని, దీని వెనుక మిల్లర్లతో ప్రభుత్వం కుమ్మక్కైందని ఆరోపించారు. కొనుగోలు కేంద్రాల్లో ఒకసారి, మిల్లుల వద్ద మరోసారి తరుగు పేరిట రైతులను నిలువు దోపిడీ చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. గత యాసంగిలో వడ్లకు ఇస్తామన్న బోనస్ ఏమైందని ప్రశ్నించారు. ఈ సీజన్‌లోనైనా ఇస్తారా లేదా అని ప్రభుత్వాన్ని నిలదీశారు. రుణమాఫీ విషయంలో కూడా రైతులను మోసం చేశారని హరీశ్ రావు (Harish Rao) విమర్శించారు. ఇప్పటికైనా ముఖ్యమంత్రి, మంత్రులు క్షేత్రస్థాయిలో పర్యటించి కొనుగోలు కేంద్రాలను పరిశీలించాలని డిమాండ్ చేశారు. వరి ధాన్యమే కాకుండా మొక్కజొన్న, జొన్న కొనుగోళ్లు కూడా అటకెక్కాయని, ప్రభుత్వం ఇప్పటివరకు వాటి ఊసే ఎత్తడం లేదని విమర్శించారు.
మరోవైపు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) తీరుపై హరీశ్ రావు తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. “ముఖ్యమంత్రి 70 సార్లు ఢిల్లీకి వెళ్లారు కానీ, ఒక్కసారి కూడా ధాన్యం కొనుగోలు కేంద్రాలకు వచ్చి రైతుల కష్టాలను చూడలేదు” అని ఎద్దేవా చేశారు. అధికారులకు, ఎమ్మెల్యేలకు, మంత్రులకు రైతుల గోడు పట్టడం లేదని, తక్షణమే క్షేత్రస్థాయిలో పర్యటించి కొనుగోలు ప్రక్రియను వేగవంతం చేయాలని డిమాండ్ చేశారు. JJL 24433 వంటి దొడ్డు రకాలు , KNM సన్న రకాలను ప్రభుత్వం బేషరతుగా కొనుగోలు చేయాలని సూచించారు.
ప్రస్తుత ప్రభుత్వం రైతులకు ఇచ్చిన ఏ ఒక్క హామీని నెరవేర్చలేదని విమర్శించారు. సన్న వడ్లకు బోనస్ రావడం లేదని, రైతు భరోసా ఇప్పటికీ అందరికీ అందలేదని, పంట బీమా ఊసే లేదని ఆయన గుర్తుచేశారు. ప్రభుత్వం వెంటనే స్పందించి ధాన్యం కొనుగోళ్లు పూర్తి చేయకపోతే, బీఆర్ఎస్ పార్టీ తరపున పెద్ద ఎత్తున పోరాటానికి సిద్ధమవుతామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ కోటిరెడ్డి, మాజీ ఎమ్మెల్యేలు నోముల భగత్, రవీంద్ర కుమార్, చిరుమర్తి లింగయ్య, కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి, బొల్లం మల్లయ్య యాదవ్, ఎమ్మెల్సీ ఎంసీ కోటిరెడ్డి పాల్గొన్నారు.
Read Also: రేపు భూపాలపల్లిలో సీఎం రేవంత్ పర్యటన
Follow Us On: X(Twitter)

