కలం, వెబ్ డెస్క్: తెలంగాణలో కరువు (Telangana Drought)ని ఎదుర్కొనే శక్తి బీఆర్ఎస్ హాయంలో నిర్మించిన ప్రాజెక్టులకు ఉందని ఆ పార్టీ నేత, మాజీ మంత్రి హరీశ్ రావు (Harish Rao) స్పష్టం చేశారు. తాము నిర్మించిన కాళేశ్వరం ఎత్తిపోతల, దేవాదులు, సమ్మక్క బ్యారేజీ, సీతమ్మ సాగర్, పాలమూరు ఎత్తిపోతల పథకాలకు కరువుని ఎదుర్కొని ప్రజల్ని కాపాడే శక్తి ఉందని ధీమా వ్యక్తం చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఆ ప్రాజెక్టులను పూర్తి చేయకుండా ఉన్న నీళ్లను లిఫ్ట్ చేయకుండా లేని కరువుని తెలంగాణ ప్రజలపై రుద్దిందని దుయ్యబట్టారు. తెలంగాణలో తీవ్ర కరువు పరిస్థితులు ఉన్నాయని.. ఇప్పటికైనా రేవంత్ సర్కార్ రైతులకు, ప్రజలకు నీళ్లు ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఈ మేరకు సిద్దిపేట క్యాంప్ కార్యాలయంలో మీడియాతో మీడియాతో ఆయన మాట్లాడారు.
కాంగ్రెస్ ఖర్చును వృధా కాకుండా చేశాం..
కాంగ్రెస్ ప్రభుత్వం నిర్మిస్తోన్న యంగ్ ఇండియా స్కూల్స్ 87 నియోజకవర్గాలకు ఇచ్చారని.. సిద్ధిపేట నియోజకవర్గానికి ఎందుకు ఇవ్వలేదు? అని సీఎం రేవంత్ ను హరీశ్ రావు నిలదీశారు. సిద్ధిపేట తెలంగాణ రాష్ట్రంలో లేదా? మా ప్రజలపై ఈ వివక్ష ఎందుకు? అని ప్రశ్నించారు. కనీసం బ్రేక్ఫాస్ట్ పథకాన్ని కూడా సిద్ధిపేటలో ఇంతవరకూ ప్రారంభించలేదని అన్నారు. నీళ్లు లేని చోట కాంగ్రెస్ ప్రాజెక్టులు తెచ్చిందని.. దానిని సరిదిద్దెందుకే నీళ్లు ఉన్న చోట ప్రాజెక్టులను మార్చి నిర్మించామని అన్నారు. గత కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో పెట్టిన ఖర్చు వృధా కాకుండా బీఆర్ఎస్ వాటిని సద్వినియోగం చేసిందని చెప్పారు.
ఏ మొహం పెట్టుకుని వస్తున్నావు?
ఏ మొహం పెట్టుకుని సిద్ధిపేటకు రేవంత్ రెడ్డి వస్తున్నారో చెప్పాలని హరీశ్ రావు (Harish Rao) ఘాటు వ్యాఖ్యలు చేశారు. మొదటిసారి వచ్చి కొమురవెల్లి మల్లన్న మీద ఒట్టు వేసి రుణమాఫీ చేస్తానని మాట ఇచ్చి మాట తప్పారని మండిపడ్డారు. రెండోసారి వచ్చి రైతుబంధు ఇస్తానని చెప్పి ఎగ్గొట్టారని అన్నారు. ముఖ్యమంత్రికి చీము నెత్తురు ఉంటే పూర్తిగా రుణమాఫీ చేసి, రైతుబంధు వేయాలన్నారు. అప్పుడు సిద్ధిపేటకు వస్తే తానే ముఖ్యమంత్రికి స్వాగతం పలుకుతానని చెప్పారు.
Also Read : ధర్మ దీక్షలకు 2.15 లక్షల మంది CPS ఉద్యోగుల పిలుపు
Follow Us On : WhatsApp

