అక్కడ తప్పకుండా చిన్నజీయర్ స్వామి ఉండాల్సిందే: హరీశ్ రావు

కలం, వెబ్ డెస్క్: దేశంలో ఎక్కడ కొత్త దేవాలయం నిర్మించినా, జీర్ణోద్ధారణ జరిగినా అక్కడ తప్పకుండా చిన్నజీయర్ స్వామి వారు ఉండాల్సిందేనని మాజీ మంత్రి హరీశ్ రావు (Harish Rao) కొనియాడారు. విజయవాడలోని అఖిల భారత హనుమాన్ దీక్షా పీఠంలో, హనుమాన్ మాల రూపకర్త శ్రీశ్రీశ్రీ దుర్గాప్రసాద్ స్వామీజీ ఆధ్వర్యంలో జరిగిన ఆంజనేయ స్వామి ఆలయ జీర్ణోద్ధారణ, పునఃప్రతిష్ఠ, కుంభాభిషేక కార్యక్రమాలు వైభవంగా నిర్వహించారు. త్రిదండి చిన్నజీయర్ స్వామి చేతుల మీదుగా జరిగిన ఈ కార్యక్రమంలో హరీశ్ రావు పాల్గొని స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు.

ఈ సందర్భంగా హరీశ్ రావు మాట్లాడుతూ.. హనుమాన్ జయంతి పర్వదినాన ఇద్దరు గొప్ప పీఠాధిపతులు, గురూజీలు చిన్నజీయర్ స్వామి, దుర్గాప్రసాద్ స్వామీజీ సమక్షంలో ఈ ఆలయ పునఃప్రతిష్ఠ కార్యక్రమంలో పాల్గొనడం నా పూర్వజన్మ సుకృతంగా, అదృష్టంగా భావిస్తున్నానని చెప్పారు. గతంలో తమ స్వగ్రామంలో చెన్నకేశవ స్వామి ఆలయాన్ని నిర్మించినప్పుడు కూడా చిన్నజీయర్ స్వామి వారి స్వహస్తాల మీదుగానే ప్రాణప్రతిష్ఠ జరగడం తమ అదృష్టమని తెలిపారు. సమాజాన్ని ప్రేమించాలి, సమానత్వాన్ని పాటించాలి అనే గొప్ప నినాదంతో పవిత్ర యజ్ఞాన్ని చిన్నజీయర్ స్వామి ముందుకు తీసుకెళ్తున్నారని అన్నారు. హైదరాబాద్‌లో వారు ప్రతిష్ఠించిన స్టాచ్యూ ఆఫ్ ఈక్వాలిటీ దానికి నిలువెత్తు నిదర్శనమని పేర్కొన్నారు.

హిందూ ధర్మ పరిరక్షణ కోసం, సమాజంలో సమానత్వం కోసం, నిత్య లోక కల్యాణం కోసం స్వామీజీ నిరంతరం కృషి చేస్తున్నారని హరీశ్ రావు కొనియాడారు. ఇరువురు స్వాములు లోకరక్షకులుగా ముందుకు సాగుతున్నారని.. మనకు కనిపించే దైవం చిన్నజీయర్ స్వామి వారు అని కొనియాడారు. దుర్గాప్రసాద్ స్వామీజీతో తమ సిద్దిపేట ప్రాంతానికి విడదీయరాని అవినాభావ అనుబంధం ఉందని చెప్పారు. ఆయన వద్ద మాల వేసుకోవడానికి తమ ప్రాంతం నుంచి వేలాది మంది వస్తుంటారని చెప్పారు. భక్తుల కోరిక మేరకు, గత రెండేళ్లుగా స్వామీజీ స్వయంగా సిద్దిపేటకే వచ్చి భక్తులకు మాలాధారణ చేయించడం చాలా విశేషమని పేర్కొన్నారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>