epaper
Thursday, January 15, 2026
spot_img
epaper

రేవంత్ వచ్చాక సింగరేణిలో 50వేల కోట్ల అప్పు : హరీశ్​ రావు

కలం, వెబ్​ డెస్క్ : తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన కొద్ది కాలంలోనే సింగరేణి (Singareni) సంస్థను రూ.50 వేల కోట్ల అప్పుల్లోకి నెట్టేసిందని మాజీ మంత్రి హరీశ్‌ రావు (Harish Rao) ఆరోపించారు. ఒకప్పుడు లాభాల బాటలో ఉన్న సంస్థ, నేడు కార్మికులకు జీతాలు చెల్లించడానికి కూడా ఓడీ (ఓవర్ డ్రాఫ్ట్) తీసుకోవాల్సిన దుస్థితికి రావడం దారుణమన్నారు. విద్యుత్ బిల్లులు సకాలంలో చెల్లించకపోవడం వల్ల సంస్థ గొంతు కోస్తున్నారని, ఆర్థిక మంత్రిగా ఉండి భట్టి విక్రమార్క గారు ఈ అన్యాయాన్ని ఎలా చూస్తు ఊరుకుంటున్నారని ఆయన ప్రశ్నించారు.

వ్యక్తిగత విలాసాల కోసం నిధుల మళ్లింపు

రేవంత్ రెడ్డి (Revanth Reddy) తన వ్యక్తిగత ఆనందం కోసం, ఫుట్‌బాల్ మ్యాచ్‌లు నిర్వహించడం కోసం సింగరేణికి చెందిన రూ. 10 కోట్ల నిధులను ఎలా ఖర్చు చేస్తారని హరీశ్‌ రావు  నిలదీశారు. ‘సింగరేణి నిధులు నీ అయ్య సొమ్మా రేవంత్ రెడ్డి?’ అంటూ ఆయన ఘాటుగా విమర్శించారు. భవిష్యత్తులో బీఆర్ఎస్ అధికారంలోకి రాగానే ఈ నిధుల దుర్వినియోగంపై విచారణ జరిపించి, బాధ్యులను కచ్చితంగా జైలుకు పంపిస్తామని హెచ్చరించారు.

కార్మిక వ్యతిరేక ప్రభుత్వం

డిపెండెంట్ ఉద్యోగాల విషయంలో ప్రభుత్వం దుర్మార్గంగా వ్యవహరిస్తోందని హరీశ్‌ రావు మండిపడ్డారు. గతంలో చంద్రబాబు నాయుడు డిపెండెంట్ ఉద్యోగాలను రద్దు చేస్తే, అధికారంలోకి వచ్చాక కేసీఆర్ గారు వాటిని పునరుద్ధరించి కార్మిక కుటుంబాలను ఆదుకున్నారని గుర్తు చేశారు. ప్రస్తుతం సింగరేణిలో ఉన్న 40 వేల మందిలో 20 వేల మంది డిపెండెంట్ ఉద్యోగులేనని, వారందరినీ కేసీఆర్ గారే నియమించారని తెలిపారు. రెండేళ్లలో రెండు సార్లు మాత్రమే మెడికల్ బోర్డు నిర్వహించి కార్మికులను గోస పెడుతున్నారని, కళ్లు కనిపించని, గుండె ఆపరేషన్ అయిన కార్మికులను కూడా విధులకు రావాలని వేధించడం మానవత్వం లేని చర్య అని ఆగ్రహం వ్యక్తం చేశారు.

ప్రైవేటీకరణ కుట్రలు.. జర్నలిస్టుల అణచివేత

సింగరేణిని ప్రైవేటు వ్యక్తుల చేతుల్లో పెట్టేందుకే ప్రభుత్వం కుట్రలకు పాల్పడుతోందని హరీశ్‌ (Harish Rao) రావు విమర్శించారు. అలాగే, రాష్ట్రంలో ప్రశ్నించే జర్నలిస్టులను అక్రమంగా అరెస్టు చేస్తున్నారని, సోషల్ మీడియా జర్నలిస్టులను ఉగ్రవాదులుగా చిత్రీకరించడం దారుణమని అన్నారు. కేసీఆర్ హయాంలో 26 వేల అక్రిడేషన్ కార్డులు ఇస్తే, ప్రస్తుత ప్రభుత్వం వాటిని 10 వేలకు తగ్గించిందని దుయ్యబట్టారు. అరెస్టు చేసిన జర్నలిస్టులను వెంటనే విడుదల చేయాలని, లేదంటే రాబోయే అసెంబ్లీ సమావేశాల్లో ప్రభుత్వాన్ని నిలదీస్తామని ఆయన స్పష్టం చేశారు.

తక్షణమే మెడికల్ బోర్డు ఏర్పాటు చేసి కార్మికుల బిడ్డలకు ఉద్యోగాలివ్వాలని, లేనిపక్షంలో వారందరితో కలిసి డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క (Bhatti) నివాసాన్ని ముట్టడిస్తామని హరీశ్‌ రావు హెచ్చరించారు.

Read Also: హైదరాబాద్ లో కల్తీని అరికడతాం : సజ్జనార్

Follow Us On: Youtube

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>