కలం, వెబ్ డెస్క్: తెలంగాణలో రెండు నెలలుగా పెండింగ్ లో ఉన్న అంగన్‌వాడీల వేతనాలను చెల్లించాలని బీఆర్ఎస్ మాజీ మంత్రి హరీశ్ రావు (Harish Rao) డిమాండ్ చేశారు. అప్‌గ్రేడ్ చేసిన మినీ అంగన్‌వాడీలకు ఏడాదిగా పెండింగ్‌లో ఉన్న పెంచిన వేతనాలను తక్షణం చెల్లించాలని కోరారు. సీఎం రేవంత్.. ముందు అంగన్ వాడీలకు జీతాలు చెల్లించి మహిళల పట్ల గౌరవాన్ని నిలబెట్టుకోవాలని సూచించారు. రెండు నెలలుగా జీతాలు అందక అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్న 62 వేల అంగన్‌వాడీ సోదరీమణుల కష్టాలు కనిపించడం లేదా? అని ప్రశ్నించారు. నెలల తరబడి జీతాలు ఇవ్వకుండా వేదిస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వానికి అంగన్‌వాడీల ఉసురు తగులుతుందని మండిపడ్డారు. మహిళా మంత్రిగా ఉన్న సీతక్క సాటి మహిళల కన్నీటి గోస అర్థం చేసుకోకపోవడం శోచనీయమని విమర్శించారు.
దేశంలోనే అత్యధికంగా చెల్లించాం..
అంగన్ వాడీ టీచర్లకు 2014 నాటికి కేవలం రూ.4,200, వారి సహాయకులకు రూ.2,200 వేతనం లభించేదని హరీశ్ రావు గుర్తు చేశారు. బీఆర్ఎస్ అధికారంలోకి వచ్చాక అంగన్‌వాడీ టీచర్ల వేతనాన్ని రూ.13,650లకు, మినీ అంగన్ వాడీ టీచర్ల వేతనాన్నిరూ.7,800, అంగన్ వాడీ హెల్పర్ల వేతనాన్ని రూ.7,800లకు పెంచి దేశంలోనే అత్యధికంగా చెల్లించామని తెలిపారు. అభయహస్తం పేరిట ఇచ్చిన ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చిన అంగన్‌వాడీ టీచర్ల వేతనాన్ని 18,000లకు పెంచాలని డిమాండ్ చేశారు. ఈపీఎఫ్ పరిధిలోకి తీసుకువచ్చి ఉద్యోగ భద్రత కల్పించాలని కోరారు. ఎన్నికలకు ముందు అరచేతిలో వైకుంఠం, అధికారంలోకి వచ్చాక అబద్దాలు ప్రచారం చేసుకుంటం అనే విధంగా కాంగ్రెస్ వైఖరి ఉందని దుయ్యబట్టారు. సమస్యల పరిష్కారం కోసం ఛలో సెక్రెటేరియట్ పిలుపునిచ్చిన అంగన్‌వాడీల పట్ల ప్రభుత్వం పోలీసులను ప్రయోగించి, కర్కషంగా వ్యవహరించారని ఫైర్ అయ్యారు.

