కలం, వెబ్ డెస్క్: రేవంత్ రెడ్డిది హైబ్రిడ్ మోడల్ కాదని.. అది కేంద్రంలోని బీజేపీ పెద్దలతో కుదుర్చుకున్న క్రాస్‌బ్రీడ్ బంధం అని బీఆర్ఎస్ మాజీ మంత్రి హరీశ్ రావు (Harish Rao) చురకలు అంటించారు. ఈ క్రాస్‌బ్రీడ్ సిద్ధాంతం రాహుల్ గాంధీకి, సోనియా గాంధీకి అర్థమవుతుందో లేదో అంటూ ఎద్దేవా చేశారు. డీలిమిటేషన్ పేరుతో మహిళా రిజర్వేషన్ల బిల్లును అటకెక్కించి.. బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు మహిళలకు తీరని ద్రోహం చేశాయన్నారు. బడే భాయ్‌కి భయపడే ఎంపీ తేజస్వీ వ్యాఖ్యలపై సీఎం రేవంత్ స్పందించలేదని ఆరోపించారు. రేవంత్ రెడ్డి, బీజేపీ మధ్య ఉన్న బడే భాయ్ ఛోటే భాయ్ బంధం మరోసారి బట్టబయలైందని మండిపడ్డారు. దేశవ్యాప్తంగా కాంగ్రెస్ నాయకుల ఇళ్లను ముట్టడించాలని బీజేపీ పిలుపునిస్తే.. రేవంత్ రెడ్డి మాత్రం ఢిల్లీలో బీజేపీ కేంద్రమంత్రి శ్రీనివాస్ వర్మ ఇంటికి భోజనానికి వెళ్లాడని ఫైర్ అయ్యారు. కార్యకర్తలేమో కొట్లాడుకోవాలి.. మీరేమో విందులు చేసుకోవాలా? అని ప్రశ్నించారు.
ఆ ఘనత బీఆర్ఎస్ పార్టీదే..
మహిళా రిజర్వేషన్ల (Women Reservation) విషయంలో బీజేపీ, కాంగ్రెస్ పార్లమెంటులో కొట్లాడినట్లు నాటకాలు ఆడుతూ మహిళలకు తీరని ద్రోహం చేశాయన్నారు. మహిళా బిల్లుకు నిజంగా చట్టబద్ధత కల్పించాలనుకుంటే దాన్ని డీలిమిటేషన్ (Delimitation) ప్రక్రియతో ఎందుకు ముడిపెట్టారు? అని ప్రశ్నించారు. బీజేపీకి పార్లమెంటులో 2/3 మెజార్టీ లేదని ఆ పార్టీకి స్పష్టంగా తెలుసని చెప్పారు. కేవలం రాజకీయాల కోసమే, ఎటువంటి చిత్తశుద్ధి లేకుండానే మహిళా బిల్లును తీసుకొచ్చారని ఆరోపించారు. మహిళా రిజర్వేషన్లపై బీఆర్ఎస్ చిత్తశుద్ధి ఏనాడో నిరూపితమైందని చెప్పారు. కేసీఆర్ నాయకత్వంలో మొదటి తెలంగాణ శాసనసభలోనే మహిళలకు చట్టసభల్లో రిజర్వేషన్ కల్పించాలని ఏకగ్రీవ తీర్మానం చేసి కేంద్రానికి పంపిన ఘనత బీఆర్ఎస్ పార్టీదేనని హరీష్ రావు (Harish Rao) కొనియాడారు.
Read Also: బెంగాల్ ఎన్నికల్లో ‘లక్ష్మణరేఖ’.. 100 మీటర్ల దూరంలోనే…
Follow Us On : WhatsApp

