కలం, వెబ్ డెస్క్ : రాష్ట్రంలో హైబ్రిడ్ యాన్యుటీ మోడల్ (హ్యామ్) రోడ్ల టెండర్లలో దాదాపు 18వేల కోట్ల రూపాయల భారీ కుంభకోణం జరుగుతోందని మాజీ మంత్రి హరీష్ రావు (Harish Rao) సంచలన ఆరోపణలు చేశారు. ఈ నిధుల్లో 1800 కోట్ల రూపాయలు ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల ఖర్చుల కోసం మళ్లించే ప్రయత్నం జరుగుతోందని ఆయన విమర్శించారు. గతంలో జలయజ్ఞం పేరుతో సాగిన పాలన, ప్రస్తుతం రేవంత్ రెడ్డి హయాంలో ధనయజ్ఞంగా మారిందని ఆయన అన్నారు. నిబంధనల ప్రకారం మొబైలైజేషన్ అడ్వాన్స్ 3 శాతమే ఉండాలని, కానీ ప్రస్తుత ప్రభుత్వం దానిని 10 శాతానికి పెంచి కాంట్రాక్టర్లకు లబ్ధి చేకూరుస్తోందని మండిపడ్డారు. ప్రస్తుతం రాష్ట్రంలో పాత బిల్లులు పెండింగ్‌లో ఉన్నాయని, రోడ్ల నిర్వహణ పనులు నిలిచిపోయాయని పేర్కొన్నారు.
నేషనల్ హైవేస్ టెండర్లలో 20 నుండి 30 శాతం లెస్ కోట్ చేస్తుంటే, రాష్ట్రంలో మాత్రం 15 నుండి 20 శాతం ఎక్సెస్ ఉండటం గమనార్హమని హరీష్ రావు పేర్కొన్నారు. ఇది దాదాపు 50 శాతం మేర తేడా చూపిస్తోందని, దీని వెనుక పెద్ద కుట్ర దాగి ఉందని ఆరోపించారు. కమిషనర్ ఆఫ్ టెండర్స్ (COT) కి వెళ్లే అవసరం లేకుండా డిపార్ట్‌మెంటల్ కమిటీలే నిర్ణయాలు తీసుకునేలా నిబంధనలు మార్చి వేల కోట్లు కొల్లగొడుతున్నారని ఆయన విమర్శించారు. ఆర్ అండ్ బీ విభాగంలో 34 ప్యాకేజీలకు సంబంధించి 24 టెండర్లలో కాంట్రాక్టర్లు రింగ్‌గా ఏర్పడ్డారని, ముఖ్యంగా సిబెట్-సరళా, బృందా-బీవీఎస్సార్ వంటి సంస్థలు మ్యాచ్ ఫిక్సింగ్ తరహాలో టెండర్లు పంచుకున్నాయని వివరించారు.
పంచాయతీ రాజ్ శాఖలో సైతం 6వేల కోట్ల రూపాయల విలువైన 12 రోడ్ల పనులను కేవలం కొన్ని సంస్థలకే కట్టబెట్టారని హరీష్ రావు ఆరోపించారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఎక్సెస్ సీలింగ్ పరిమితిని ఎత్తేసి, తమకు నచ్చిన వారికి దోచిపెడుతోందని విమర్శించారు. దండుపాళ్యం ముఠాలాగా కాంట్రాక్టులను, ఫండ్ ను పంచుకున్నారన్నారు. ఈ వ్యవహారంపై బీఆర్ఎస్ తరపున గట్టిగా పోరాడుతామని, అసెంబ్లీలో పద్దుల చర్చ సందర్భంగా ప్రభుత్వాన్ని నిలదీస్తామని హెచ్చరించారు.
ఈ మొత్తం వ్యవహారంపై పారదర్శకత ఉండాలంటే వెంటనే టెండర్లను రద్దు చేసి, తిరిగి నిర్వహించాలని హరీష్ రావు డిమాండ్ చేశారు. ఈ అక్రమాలపై సిట్టింగ్ హైకోర్టు జడ్జితో విచారణ జరిపించాలని, ఎక్సెస్ సీలింగ్ 5 శాతం పరిమితిని పునరుద్ధరించాలని కోరారు. ప్రభుత్వం స్పందించని పక్షంలో సెంట్రల్ విజిలెన్స్ కమిషన్ (CVC) కు ఫిర్యాదు చేస్తామని తెలిపారు. అక్రమాలకు పాల్పడే అధికారులను, కాంట్రాక్టర్లను వదిలిపెట్టే ప్రసక్తి లేదని హరీష్ రావు (Harish Rao) హెచ్చరించారు.
Read Also: రీల్స్ పిచ్చి.. తుపాకీతో కాల్చుకొని చనిపోయిన యువకుడు
Follow Us On: Instagram

