డబుల్ బెడ్‌రూమ్ ఇళ్లపై ప్రభుత్వం ఫోకస్

కలం, మహబూబ్‌నగర్ బ్యూరో: డబుల్ బెడ్‌రూమ్, ఇందిరమ్మ ఇళ్ల కేటాయింపులో పూర్తి పారదర్శకత పాటించి, నిజమైన అర్హులైన పేద కుటుంబాలకు మాత్రమే ప్రాధాన్యం ఇవ్వాలని గృహ నిర్మాణ శాఖ ఎండీ, కార్యదర్శి, మహబూబ్‌నగర్ (Mahabubnagar) జిల్లా ప్రత్యేక అధికారి వి.పి. గౌతమ్(VP Gautham) అధికారులను ఆదేశించారు. ఇప్పటికే నిర్మాణం పూర్తయిన డబుల్ బెడ్‌రూమ్ ఇళ్లను ఖాళీగా ఉంచకుండా వెంటనే అర్హులైన లబ్ధిదారులకు కేటాయించాలని సూచించారు. అలాగే డబుల్ బెడ్‌రూమ్, ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారుల జాబితాలను కృత్రిమ మేధ (AI) సాయంతో సరిపోల్చి, ఒకే వ్యక్తికి రెండు పథకాల ప్రయోజనం అందకుండా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. బుధవారం జిల్లా కలెక్టరేట్‌లోని వీడియో కాన్ఫరెన్స్ హాల్‌లో జిల్లా కలెక్టర్ ఖుష్బూ గుప్తాతో కలిసి గృహ నిర్మాణ, రెవెన్యూ, మున్సిపల్ అధికారులతో నిర్వహించిన సమీక్ష సమావేశంలో మాట్లాడారు.

పెండింగ్‌లో ఉన్న డబుల్ బెడ్‌రూమ్ ఇళ్లు, రెండో విడత ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారుల ఎంపిక ప్రక్రియ పూర్తిగా పారదర్శకంగా జరగాలని గౌతమ్ స్పష్టం చేశారు. ఆశా వర్కర్‌లు, అంగన్‌వాడీ సిబ్బంది, తక్కువ వేతనాలతో పనిచేసే ప్రభుత్వ సేవల సిబ్బందిని కేవలం ఉద్యోగం ఆధారంగా అనర్హులుగా ప్రకటించరాదని తెలిపారు. వారి కుటుంబ పరిస్థితులు, ఆదాయం, ఆస్తులను సమగ్రంగా పరిశీలించిన తర్వాతే నిర్ణయం తీసుకోవాలని ఆదేశించారు. ప్రతి తిరస్కరణకు స్పష్టమైన కారణాలను నమోదు చేయాలని సూచించారు. నిర్మాణం పూర్తయిన ఇళ్లను ఎక్కువకాలం ఖాళీగా ఉంచితే ప్రభుత్వ ఆస్తులకు నష్టం వాటిల్లే అవకాశం ఉందని పేర్కొంటూ, వెంటనే లబ్ధిదారులకు కేటాయించి విద్యుత్, తాగునీరు వంటి కనీస సౌకర్యాలు కల్పించాలని అధికారులను ఆదేశించారు.

సమీక్షలో మహబూబ్‌నగర్, జడ్చర్ల, దేవరకద్ర నియోజకవర్గాల పరిధిలో పూర్తయిన, అసంపూర్తిగా ఉన్న డబుల్ బెడ్‌రూమ్ ఇళ్ల వివరాలను మండలాల వారీగా అధికారులను అడిగి తెలుసుకున్నారు. ఇందిరమ్మ గృహాల రెండో దశ అమలుపై మాట్లాడుతూ, గుడిసెలలో నివసిస్తున్న కుటుంబాలకు తొలి ప్రాధాన్యం ఇవ్వాలని గౌతమ్ స్పష్టం చేశారు. రూఫ్ రీప్లేస్‌మెంట్ పథకంపై ప్రజలకు అవగాహన కల్పించాలని, గ్రామస్థాయిలో విస్తృత ప్రచారం నిర్వహించాలని ఆదేశించారు. గోడలు బాగుండి పైకప్పు మాత్రమే దెబ్బతిన్న ఇళ్లకు ప్రభుత్వం రూ.2 లక్షల ఆర్థిక సహాయం అందిస్తోందని తెలిపారు.

జడ్చర్లలో అసంపూర్తిగా నిలిచిపోయిన డబుల్ బెడ్‌రూమ్ ఇళ్ల నిర్మాణాలపై కూడా గౌతమ్ సమీక్ష నిర్వహించారు. కాంట్రాక్టర్‌కు చేసిన చెల్లింపులు, పెండింగ్ బకాయిలు, మిగిలిన పనుల వివరాలను సేకరించాలని ఆదేశించారు. అవసరమైతే పాత కాంట్రాక్టును రద్దు చేసి కొత్త కాంట్రాక్టర్‌కు పనులు అప్పగించే అంశాన్ని పరిశీలించాలని సూచించారు. అంతకుముందు గౌతమ్, కలెక్టర్ ఖుష్బూ గుప్తాతో కలిసి ఏనుగొండలోని మౌలాలి గుట్టలో నిర్మించిన డబుల్ బెడ్‌రూమ్ ఇళ్లను పరిశీలించారు. ఈ సమావేశంలో స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ మధుసూదన్ నాయక్, రెవెన్యూ అదనపు కలెక్టర్ జె.ఎల్.బి. హరిప్రియ, అసిస్టెంట్ కలెక్టర్ సాయి శివాని, డీఆర్‌ఓ ఎ. నిర్మల, ఆర్‌డీఓ నవీన్, గృహ నిర్మాణ శాఖ పీడీ ఉపేందర్ రెడ్డి, మున్సిపల్ కమిషనర్ రామానుజులరెడ్డి తదితరులు పాల్గొన్నారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>