పేద విద్యార్థులకు కార్పొరేట్​ స్థాయి విద్యనందించడే లక్ష్యం : ఎమ్మెల్యే చింతకుంట

కలం, కరీంనగర్ బ్యూరో: కార్పొరేట్ స్థాయిలో నిరుపేద విద్యార్థులకు నాణ్యమైన విద్యనందించడమే కాంగ్రెస్ ప్రభుత్వ లక్ష్యమని ప్రభుత్వ విప్, పెద్దపల్లి ఎమ్మెల్యే చింతకుంట విజయరమణ రావు (Vijay Ramana Rao) అన్నారు. పెద్దపల్లి జిల్లా కాల్వ శ్రీరాంపూర్ మండల పరిధిలోని గంగారం, ఉషన్నపల్లి గ్రామాల్లో బుధవారం ఆయన విస్తృతంగా పర్యటించారు. ఉషన్నపల్లి గ్రామంలో రూ.10 లక్షల నిధులతో నూతనంగా నిర్మించిన సీసీ రోడ్లను, ప్రాథమిక ఉన్నత పాఠశాలలో రూ.32 లక్షలతో నూతనంగా నిర్మించిన పాఠశాల భవనాన్ని, నూతనంగా ఏర్పాటు చేసిన కంప్యూటర్ ల్యాబ్‌ను స్థానిక ప్రజాప్రతినిధులు, నాయకులతో కలిసి ప్రారంభించారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే విజయ రమణారావు మాట్లాడుతూ, ఒకప్పుడు సరైన భవనం లేక కేవలం 20 మంది విద్యార్థులతో ఉన్న ఉషన్నపల్లి పాఠశాల.. నేడు ఉపాధ్యాయులు, ప్రజాప్రతినిధుల కృషి వల్ల 56 మంది విద్యార్థులతో కళకళలాడుతుండటం అభినందనీయమన్నారు. రాబోయే రోజుల్లో ఈ సంఖ్యను 75కి పెంచాలని పిలుపునిచ్చారు. పాఠశాలకు విద్యుత్ బిల్లుల భారం తగ్గించేందుకు హెడ్‌మాస్టర్ సమ్మయ్య, మండల విద్యాధికారి, గ్రామ సర్పంచ్ చొరవతో ‘సోలార్ విద్యుత్ ప్లాంట్’ ఏర్పాటు చేయడం పట్ల హర్షం వ్యక్తం చేశారు. విద్యార్థులకు మధ్యాహ్న భోజనంతో పాటు దసరా నాటికి అల్పాహారం అందించేలా ప్రణాళికలు రూపొందిస్తున్నట్లు చెప్పారు.

గ్రామస్తుల విజ్ఞప్తి మేరకు గంగారం టర్నింగ్ మెయిన్ రోడ్డు నుండి ఉషన్నపల్లి గ్రామం నుంచి పందిళ్ల చౌరస్తా వరకు డబుల్ రోడ్డు మంజూరు చేయిస్తానని ఎమ్మెల్యే హామీ ఇచ్చారు. అలాగే శ్రీరాంపూర్ ఆర్ అండ్ బి రోడ్డు నుండి ఉషన్నపల్లి ఎస్సీ కాలనీ వరకు రోడ్డు నిర్మాణానికి ఎస్టిమేషన్ సిద్ధం చేసి పనులు పూర్తి చేస్తామన్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో అత్యున్నత విద్య అర్హతలు కలిగిన మెరిట్ ఉపాధ్యాయులు బోధిస్తున్నారని, ప్రైవేట్ పాఠశాలల ఫీజుల భారం నుండి తప్పించుకోవడానికి తల్లిదండ్రులు ప్రభుత్వ పాఠశాలల్లోనే పిల్లలను చేర్పించాలని కోరారు.

ఈ కార్యక్రమంలో తహసీల్దార్ రాముడు, ఎంఈఓ మహేష్, ఎంపీడీవో సురేందర్, మాజీ ఎంపీపీ గొపగోని సారయ్య గౌడ్, సర్పంచ్ రేకుల జ్యోతి రఘు, ఉప సర్పంచ్ మేడి అశోక్ గౌడ్, వ్యవసాయ మార్కెట్ చైర్మన్ రామిడి తిరుపతి రెడ్డి, కాంగ్రెస్ మండలఅధ్యక్షుడు గాజనమైన సదయ్య, పాఠశాల ప్రధానోపాధ్యాయులు ఈర్ల సమ్మయ్య, ఆయా గ్రామాల సర్పంచులు, కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు మరియు తదితరులు పాల్గొన్నారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>