ప్రభుత్వ టెండర్లలో భారీగా అవినీతి: హరీశ్ రావు

కలం, వెబ్ డెస్క్: ప్రభుత్వ టెండర్లలో భారీగా అవినీతి జరుగుతోందని బీఆర్ఎస్ ఎమ్మెల్యే, మాజీ మంత్రి హరీశ్ రావు (Harish Rao) ఆరోపించారు. తెలంగాణ భవన్‌లో మీడియాతో చిట్ చాట్‌లో మాట్లాడారు. ‘హ్యామ్ మోడల్ రోడ్లతో పెద్ద ఎత్తున అవినీతి జరుగుతోందని అసెంబ్లీలో బయటపెట్టాం. మేం చెప్పినట్లుగానే ఈ టెండరులో 25 శాతం అధికంగా వేశారు. ఆర్అండ్‌బీ శాఖలో రూ.11 వేల కోట్లకు టెండర్లు పిలిచి.. ఎక్సెస్ కలిపి రూ.15వేల కోట్లకు చేర్చారు. అలాగే, పంచాయతీరాజ్ శాఖలో రూ.6 వేల కోట్లతో తొలుత టెండర్ పిలిచి, చివరికి దాన్ని రూ.8 వేల కోట్లకు పెంచుకున్నారు. ఈ ఎక్సెస్ టెండర్ల వలన ప్రభుత్వంపై అదనంగా రూ.5 వేల కోట్ల భారం పడుతోంది. హ్యామ్ మోడల్ రోడ్ల కోసం బ్యాంకుల నుంచి 60 శాతం అప్పులు తెచ్చి, 15 ఏళ్ల పాటు వడ్డీతో సహా చెల్లిస్తామని ఒప్పందం చేసుకున్నారు’ అని హరీశ్ రావు వివరించారు.

‘రేవంత్ రెడ్డి చేసేవన్నీ అప్పులే..’

సీఎం రేవంత్ రెడ్డి ప్రత్యక్షంగా చేసే అప్పులతో పాటుగా పరోక్షంగా అప్పులు చేస్తున్నారని మాజీ మంత్రి హరీశ్ రావు విమర్శించారు. ‘టెండర్లలో 10 శాతం మొబిలైజేషన్ అడ్వాన్సులు ఇచ్చేందుకు ప్రభుత్వం సిద్ధమైంది. ప్రాణహిత చేవెళ్ల కోసం అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం మొబిలైజేషన్ అడ్వాన్సుల విధానాన్ని తెస్తే.. దాన్ని రేవంత్ రెడ్డి వ్యతిరేకించారు. ఇది జల యజ్ఞం కాదు ధనయజ్ఞం అన్నారు. ఇప్పుడు ఆయనే మళ్లీ మొబిలైజేషన్ అడ్వాన్సుల విధానాన్ని తెస్తున్నారు. 2014లో బీఆర్ఎస్ అధికారంలోకి రాగానే.. ఈ విధానాన్ని పూర్తిగా రద్దు చేశాం. ఎవరైనా 5 శాతం కంటే ఎక్కువగా టెండర్ ఉంటే వెంటనే రీ కాల్ చేసేవాళ్లం. ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం 25 శాతం టెండర్ ఎక్సెస్ వేస్తున్నా, పట్టించుకోవడం లేదు. దీన్ని వెంటనే రద్దు చేయాలి. రేవంత్ రెడ్డి ఇవ్వాళ ఉంటాడు, రేపు అధికారంలో నుంచి వెళ్లిపోతాడు. అంతిమంగా ఈ భారం ప్రజలపై పడుతుంది’ అని విమర్శించారు.

‘రిటైర్డ్ అధికారులతో టెండర్లు..’

ప్రభుత్వం వేస్తున్న టెండర్లలో ఒకే కంపెనీకి 15 ప్రాజెక్టులు దక్కబోతున్నాయని హరీశ్ రావు పేర్కొన్నారు. ‘త్వరలోనే ఆధారాలతో బయటపెడుతా. R&Bలో రిటైర్డ్ అయిన చీఫ్ ఇంజనీర్ వెంకటేశ్వరరావు , పంచాయితీ రాజ్ చీఫ్ ఇంజనీర్ జోగారెడ్డి పదవీ కాలాన్ని పొడిగించి ఈ టెండర్ల ప్రక్రియ చేస్తున్నారు. టెండర్ల కోసమే ప్రధానంగా ఇంజినీరింగ్ విభాగాల్లో అధికారులకు పొడిగింపు ఇస్తున్నారు’ అని ఆరోపించారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>