కలం, వెబ్ డెస్క్ : రంగారెడ్డి జిల్లా మొయినాబాద్ (Moinabad) మండలం పెద్దమంగళారం గ్రామ శివారులో విషాదం చోటుచేసుకుంది. కేజీ రెడ్డి ఇంజినీరింగ్ కళాశాలకు చెందిన ఇద్దరు విద్యార్థులు విద్యుత్ తీగలు తగిలి దుర్మరణం చెందారు.
కళాశాలలో జరిగిన ఫెస్ట్ ముగిసిన తర్వాత, పది మంది విద్యార్థులు కలిసి సమీపంలోని పొలాల వైపు వెళ్లారు. అక్కడ మద్యం సేవిస్తుండగా, ఆ దారిలో వస్తున్న పోలీసు పెట్రోలింగ్ వాహనాన్ని చూసి భయంతో వారు పరుగులు తీశారు. ఆ సమయంలో చీకటిలో పొలం చుట్టూ అడవి పందుల బెడద నివారణ కోసం రైతు రాజిరెడ్డి ఏర్పాటు చేసిన విద్యుత్ తీగలు తగిలి ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో మోహన్ (యశ్వంత్), మోక్షా చరణ్ అనే ఇద్దరు విద్యార్థులు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు.
సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే సంఘటనా స్థలానికి చేరుకుని పరిస్థితిని సమీక్షించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకుని, మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించి దర్యాప్తు చేస్తున్నారు. కాలేజీ ఫెస్ట్ ఆనందంలో ఉండాల్సిన విద్యార్థులు ఇలా విగతజీవులుగా మారడంతో వారి కుటుంబాల్లో, కళాశాలలో విషాద ఛాయలు అలుముకున్నాయి.

