కలం, తెలంగాణ బ్యూరో : శంషాబాద్ మండలంలో సుమారు వెయ్యి కోట్ల రూపాయల విలువైన 170 ఎకరాల ప్రభుత్వ భూమిని ప్రైవేటు వ్యక్తులకు దారాదత్తం చేసేందుకు భారీ కుంభకోణం జరిగిందని బీఆర్‌ఎస్ నేత హరీశ్ రావు (Harish Rao) సంచలన ఆరోపణలు చేశారు. మంగళవారం తెలంగాణ భవన్‌లో మీడియాతో ఆయన మాట్లాడారు. ఈ కుంభకోణం వెనక ప్రభుత్వ పెద్దల హస్తం ఉందని, ప్రభుత్వ భూమిని కాపాడేందుకు తక్షణమే సిట్ లేదా సీబీసీఐడీ విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. శంషాబాద్ మండలం పెద్ద షాపూర్ పరిధిలోని సర్వే నంబర్లు 173-183లలోని 170 ఎకరాల భూమి ప్రభుత్వానిదేనని, ఆక్రమణలకు గురికాకుండా చూడాలని, నిషేధిత జాబితాలో పెట్టాలంటూ తాసీల్దార్‌కు ఆర్డీవో స్పష్టమైన ఆదేశాలిచ్చారన్నారు.
ఇదే విషయాన్ని హైకోర్టుకు ఇచ్చిన అఫిడవిట్‌లోనూ పేర్కొన్నారని హరీశ్‌రావు వివరించారు. ఈ ఏడాది ఫిబ్రవరి 24న ఈ భూమి ప్రభుత్వానిదేనని తాసీల్దారు తేల్చారని, నాలుగు రోజుల వ్యవధిలోనే (ఫిబ్రవరి 28న) అది ప్రైవేటు వ్యక్తులకు చెందుతుందంటూ ఆర్డర్ పాస్ అయిందన్నారు. దీని వెనక పెద్ద కుట్రే జరిగిందన్నారు. భూ భారతి చట్టం ప్రకారం ఆర్డీవో అప్రూవల్ ఉంటేనే భూమి ఆన్‌లైన్‌లోకి ఎక్కాల్సి ఉంటుందని, కానీ ఎమ్మార్వో చెప్పిన వెంటనే నిబంధనలకు విరుద్ధంగా 170 ఎకరాల ప్రభుత్వ భూమి పట్టా భూమిగా ఆన్‌లైన్‌లో ఎంట్రీ అయిందన్నారు.
ఈ కుంభకోణంలో ముఖ్యమంత్రి సన్నిహితుడు ఒకరు ఉన్నారని, పత్రికల్లో వార్తలు రాగానే ఎమ్మార్వోను కలెక్టరేట్‌కు బదిలీ చేసి ప్రభుత్వం చేతులు దులుపుకున్నదని హరీశ్‌రావు ఆరోపించారు. ఏసీబీ అధికారులు తనిఖీలకు వెళ్లినా ప్రభుత్వ పెద్దల నుంచి వచ్చిన ఒత్తిళ్లతో వెనక్కి తగ్గారని పేర్కొన్నారు. కలెక్టర్, అడ్వకేట్ జనరల్ అనుమతి లేకుండా హైకోర్టుకు నివేదికలు ఎలా వెళ్తాయని ప్రశ్నించారు. కలెక్టర్, సీసీఎల్ఏ, ఇతర ఉన్నతాధికారుల పాత్రపై ఆరా తీయాలని హరీశ్‌రావు డిమాండ్ చేశారు. తహసీల్దార్ ఇచ్చిన వివాదాస్పద ఆర్డర్‌ను తక్షణమే సస్పెండ్ చేయాలని.. ఆయన్ను సర్వీస్ నుండి డిస్మిస్ చేయాలన్నారు. హైకోర్టు ఆర్డర్‌పై ప్రభుత్వం వెంటనే అప్పీలుకు వెళ్ళాలని డిమాండ్ చేశారు. 170 ఎకరాల భూమిని తిరిగి నిషేధిత జాబితాలో చేర్చాలని.. వాస్తవాలను వెలికి తీయడానికి సిట్ లేదా సీబీసీఐడీ విచారణకు ఆదేశించాలని హరీశ్ రావు కోరారు.

