కలం, వెబ్ డెస్క్: తెలంగాణలో రేవంత్ సర్కార్ లక్ష కోట్ల విలువైన భూములను అమ్మకానికి పెట్టిందని.. ఇప్పటికే 26 వేల కోట్ల విలువైన భూములు అమ్మేశారని బీఆర్ఎస్ మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీశ్ రావు (Harish Rao) తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ముఖ్యమంత్రి కుర్చీలో కూర్చుని రేవంత్ రెడ్డి రియల్ ఎస్టేట్ దందా చేస్తున్నాడని ఆరోపించారు. ఈ మేరకు హైదరాబాద్ లోని కూకట్పల్లి ట్రక్ పార్క్ స్థలాన్ని శుక్రవారం పరిశీలించారు. బీఆర్ఎస్, సీపీఐ, సీపీఎం ఆధ్వర్యంలో జరిగిన మహా ధర్నాలో పార్టీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీల బృందంతో కలిసి పాల్గొని మాట్లాడారు. సూర్యుడి చుట్టూ భూమి తిరిగినట్టు.. రేవంత్ రెడ్డి భూముల చుట్టే తిరుగుతున్నాడని మండిపడ్డారు.
బిడ్డా జాగ్రత్త.. వచ్చేది బీఆర్ఎస్ ప్రభుత్వమే..
రేవంత్ రెడ్డి (Revanth Reddy) రంగులు మార్చే తీరు చూసి.. ఊసరవెల్లి కూడా సిగ్గుపడి ఉరేసుకుంటుందని హరీశ్ రావు దుయ్యబట్టారు. నాడు బొందల గడ్డకు కూడా భూమి ఉండదని డైలాగులు కొట్టి.. నేడు కైతలాపూర్‌లో బొందల గడ్డను కూడా చదును చేస్తున్నారని మండిపడ్డారు. కూకట్పల్లి, మూసాపేట ట్రక్ పార్క్ భూముల్లో ఉన్న ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్, ఆర్టీఓ ఆఫీస్, ట్రాఫిక్ పోలీస్ స్టేషన్, నర్సరీని కూడా అమ్మకానికి పెట్టడం సిగ్గుచేటు అని విమర్శించారు. రేపు వచ్చేది మళ్ళీ బీఆర్ఎస్ ప్రభుత్వమేనని.. బిడ్డా జాగ్రత్త, వేలంలో ఎవరు భూములు కొన్నా అనుమతులు ఇవ్వబోమని, మళ్లీ వెనక్కి తీసుకుని ప్రజా అవసరాలకే వాడుతామని హెచ్చరించారు.
కరువు కంటే కాంగ్రెస్ పాలనే ప్రమాదకరం..
రేవంత్ సర్కార్ ముంబై బ్రోకర్‌కు రూ. 500 కోట్ల లంచం ఇచ్చి హెచ్ సీయూ, హెచ్ ఎండీఏ భూములను బాంబే స్టాక్ ఎక్స్ఛేంచీలో కుదువబెట్టి రూ. 20 వేల కోట్ల అప్పు తెచ్చారని హరీశ్ (Harish Rao) ఫైర్ అయ్యారు. హిల్ట్ పాలసీ పేరుతో బాలానగర్, జీడిమెట్ల, అజామాబాద్‌లో 9,900 ఎకరాల ఇండస్ట్రియల్ భూములను కమీషన్ల కోసం తక్కువధరకే కట్టబెడుతూ భారీ కుంభకోణానికి పాల్పడ్డారని అన్నారు. ఎల్‌నినో తెచ్చిన కరువు కంటే కాంగ్రెస్ పాలనే ప్రమాదకరమని వ్యాఖ్యానించారు.
Also Read : మోదీపై రాహుల్ గాంధీ సంచలన వ్యాఖ్యలు
Follow Us On : WhatsApp

