మ‌హ‌బూబ్‌న‌గ‌ర్ క‌లెక్ట‌రేట్‌లో చిల్డ్ర‌న్స్ డే వేడుకలు

కలం, మ‌హ‌బూబ్‌న‌గ‌ర్‌ బ్యూరో: బాలల హక్కులను పరిరక్షించడంతో పాటు, వారి ఉజ్వల భవిష్యత్తుకు అవసరమైన అన్ని రకాల సహాయ సహకారాలు అందించేందుకు జిల్లా యంత్రాంగం, వివిధ శాఖలు ఎల్లప్పుడూ అండగా ఉంటాయని జిల్లా కలెక్టర్ ఖుష్బూ గుప్తా (Khushboo Gupta) తెలిపారు. శుక్రవారం బాలల దినోత్సవాన్ని పురస్కరించుకొని జిల్లా కలెక్టరేట్ సమావేశ మందిరంలో మహిళా, శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన వేడుకల్లో కలెక్టర్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా కలెక్టర్ పండిట్ జవహర్‌లాల్ నెహ్రూ చిత్రపటానికి పూల మాల వేసి నివాళి అర్పించారు.

అనంతరం మాట్లాడుతూ.. భారత తొలి ప్రధానమంత్రి పండిట్ జవహర్‌లాల్ నెహ్రూ జన్మదినాన్ని పురస్కరించుకుని ప్రతి సంవత్సరం నవంబర్ 14న బాలల దినోత్సవాన్ని జరుపుకుంటామని తెలిపారు. పిల్లలు సంతోషంగా, స్వేచ్ఛగా జీవితాన్ని గడిపేందుకు, వారి అభిరుచులు, ఆలోచనలు, ఆశయాలకు అనుగుణంగా ఎదిగేందుకు ప్రతి ఒక్కరూ సహకరించాలని అన్నారు. ప్రతి చిన్నారికి జీవించే హక్కు, విద్యను పొందే హక్కు, ఆరోగ్యంగా ఉండే హక్కు, రక్షణ పొందే హక్కు ఉన్నాయని పేర్కొన్నారు. బాలల హక్కులకు ఎక్కడైనా భంగం కలిగితే పోలీసు, వైద్యారోగ్య, విద్య, న్యాయశాఖలతో పాటు మహిళా, శిశు సంక్షేమ శాఖ, స్వచ్ఛంద సంస్థలు వారికి అండగా నిలుస్తాయని భరోసా ఇచ్చారు. ఎలాంటి సమస్య ఎదురైనా భయపడకుండా సంబంధిత అధికారులను సంప్రదించాలని పిల్లలకు సూచించారు.

వివిధ కారణాలతో తల్లిదండ్రులకు దూరమైన పిల్లలను తిరిగి వారి కుటుంబాలకు చేరువ చేసేందుకు చైల్డ్ వెల్ఫేర్ కమిటీ ద్వారా అవసరమైన చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. బాలల భద్రత, హక్కులు, చట్టపరమైన రక్షణ, సమస్యలు ఎదురైనప్పుడు తీసుకోవాల్సిన చర్యలపై సంబంధిత అధికారులు పిల్లలకు అవగాహన కల్పించాలని సూచించారు. పిల్లల్లో ఆత్మవిశ్వాసం, మానసిక స్థైర్యాన్ని పెంపొందించేందుకు ఇటువంటి కార్యక్రమాలు ఎంతగానో దోహదపడతాయని అన్నారు. బాలల దినోత్సవం సందర్భంగా పిల్లల కోసం ప్రత్యేకంగా వినోద, సాంస్కృతిక కార్యక్రమాలు, ఆటల పోటీలు ఏర్పాటు చేయడం అభినందనీయమని కలెక్టర్ పేర్కొన్నారు. పిల్లలు ఆరోగ్యంగా, ఉత్సాహంగా, ఆనందంగా ఉండటమే తమ లక్ష్యమని తెలిపారు.

ప్రభుత్వం చేపట్టే ప్రతి కార్యక్రమం, అభివృద్ధి పనులు బాలల భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని రూపొందిస్తున్నామని చెప్పారు. వారికి మెరుగైన వాతావరణం, విద్య, వసతులు, పౌష్టికాహారం అందించేందుకు అధికారులు కృషి చేస్తున్నారని వివరించారు. పిల్లలు ప్రస్తుతం తమ జీవితంలో ఎంతో విలువైన బాల్య దశలో ఉన్నారని, ఈ సమయాన్ని ఆనందంగా గడుపుతూ కొత్త విషయాలను నేర్చుకోవాలని సూచించారు. ఉపాధ్యాయులు, సంరక్షకులు పిల్లల పట్ల ఓర్పు, సహనంతో వ్యవహరించాలని కోరారు. పిల్లల ప్రతిభను ప్రోత్సహిస్తూ, వారి అభిరుచులకు తగిన అవకాశాలు కల్పించాలని అన్నారు. CCI విద్యార్థులు ఆలపించిన జాతీయ గీతం, తెలంగాణ రాష్ట్ర గీతం కలెక్టర్‌ను ఆకట్టుకున్నాయి. చిన్నారులు ఎంతో చక్కగా, ఏకాగ్రతతో పాటలను నేర్చుకుని ఆలపించడం అభినందనీయమని ఆమె ప్రశంసించారు. పిల్లల స్వచ్ఛమైన మనసు, నేర్చుకునే ఆసక్తి పెద్దలకు కూడా ఆదర్శంగా నిలుస్తాయని పేర్కొన్నారు. తాము కూడా వారి నుంచి స్ఫూర్తి పొంది పాటలను నేర్చుకోవాలని కలెక్టర్ అన్నారు.

బాలల దినోత్సవం సందర్భంగా మహిళా, శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో వారం రోజుల పాటు వివిధ బాలల సంరక్షణ సంస్థల్లో చిత్రలేఖనం, పెయింటింగ్, సంప్రదాయ దుస్తుల ప్రదర్శన, కబడ్డీ తదితర క్రీడా, సాంస్కృతిక పోటీలు నిర్వహించినట్లు అధికారులు తెలిపారు. CCI విద్యార్థులు ప్రదర్శించిన నృత్యం అందరినీ ఆకట్టుకుంది. జిల్లా కలెక్టర్ చిన్నారులతో కలిసి కేక్ కట్ చేసి పిల్లలందరికీ బాలల దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు.
ఈ కార్యక్రమంలో జిల్లా మహిళా, శిశు సంక్షేమ శాఖ అధికారి జరీనా బేగం, జిల్లా రెడ్‌క్రాస్ సొసైటీ చైర్మన్ కె.ఎస్. రవికుమార్, వివిధ బాలల సంరక్షణ సంస్థలకు చెందిన చిన్నారులు, విద్యార్థులు, ఉపాధ్యాయులు, సంబంధిత శాఖల అధికారులు తదితరులు పాల్గొన్నారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>