కలం, వెబ్డెస్క్: అస్సాంలో ఘోర రోడ్డు ప్రమాదం (Assam Road Accident) జరిగింది. ఓ కాలేజీ వ్యాన్ను ట్రక్కు ఢీకొట్టడంతో పది మంది విద్యార్థులు మృతి చెందారు. ఈ ఘటన కజిరంగా ప్రాంతంలోని రోంగాజన్ వద్ద జరిగింది. ప్రమాదం జరిగిన సమయంలో కాలేజీ వ్యాన్లో సుమారు 35 మంది విద్యార్థులు ఉన్నారు. వీరిలో చాలా మంది తీవ్ర గాయాలపాలయ్యారు. ఈ ప్రమాదంపై సమాచారం అందిన వెంటనే పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని సహాయక చర్యలు ప్రారంభించారు.క్షతగాత్రులను ఆస్పత్రికి తరలిస్తున్నారు. ప్రమాద తీవ్రతను బట్టి చూస్తే మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని తెలుస్తోంది.
ప్రమాద తీవ్రతకు వ్యాన్ పూర్తిగా ధ్వంసమైంది. పలువురు ప్రయాణికులు వ్యాన్ శిథిలాల్లో చిక్కుకుపోయారు. ఘటనా స్థలానికి చేరుకున్న సహాయక సిబ్బంది శిథిలాల నుంచి మృతదేహాలను బయటకు తీస్తుండటంతో విషాదకర పరిస్థితులు నెలకొన్నాయి. క్షతగాత్రుల్లో పలువురిని చికిత్స నిమిత్తం కోహోరా మోడల్ ఆసుపత్రికి తరలించారు. ఈ ప్రమాదంపై సమాచారం అందుకున్న అసోం మంత్రి అతుల్ బోరా ప్రమాద స్థలానికి చేరుకుని సహాయక చర్యలను పర్యవేక్షిస్తున్నారు. ప్రస్తుతం సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. ప్రమాదానికి గల పూర్తి కారణాలు, మృతుల సంఖ్యపై అధికారిక సమాచారం తెలియాల్సి ఉంది.

