కలం, కరీంనగర్ బ్యూరో : పెద్దపల్లి , జగిత్యాల జిల్లా లో పార్లమెంట్ సభ్యులు గడ్డం వంశీకృష్ణ (Peddapalli MP) పర్యటించి పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపనలు చేశారు. ముఖ్యంగా ధర్మపురి నియోజకవర్గ పరిధిలో ఎంపీ ల్యాడ్స్ నిధుల నుంచి దాదాపు రూ.1.20 కోట్లతో వివిధ అభివృద్ధి పనులకు నిధులు మంజూరు చేసినట్లు ఎంపీ వెల్లడించారు. పత్తిపాక, నర్సింగాపూర్ గ్రామాల్లో సుమారు రూ.12 లక్షల ఎంపీ నిధులతో చేపట్టనున్న సీసీ రోడ్లు, ఇతర అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు చేశారు. పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలో ప్రజల అవసరాలకు అనుగుణంగా బోర్‌వెల్స్, సీసీ రోడ్లు, డ్రైనేజీ నిర్మాణ పనులను ఎంపీ ల్యాడ్స్ నిధులతో చేపడుతున్నట్లు తెలిపారు.
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలో రాష్ట్రవ్యాప్తంగా అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు కొనసాగుతున్నాయని, రాష్ట్రంలో పెన్షన్ పథకం ప్రారంభం కావడం సంతోషకరమని ఎంపీ పేర్కొన్నారు. విశాఖ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో కూడా పెద్దపల్లి పార్లమెంట్ పరిధిలో నిరంతరాయంగా సేవా కార్యక్రమాలు కొనసాగుతున్నాయని తెలిపారు.
అభివృద్ధి కార్యక్రమాలతో పాటు కాళేశ్వరం ప్రాజెక్టుపై బీఆర్ఎస్ నేతల తీరును ఎంపీ తీవ్రంగా విమర్శించారు. కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణం పేరుతో తెలంగాణను అప్పుల ఊబిలోకి నెట్టారని, రైతులకు ఆశించిన స్థాయిలో సాగునీరు అందించలేకపోయారని విమర్శించారు. కాకా వెంకటస్వామి ఆశయమైన ప్రాణహిత-చేవెళ్ల ప్రాజెక్టును తుమ్మిడిహట్టి వద్ద నిర్మించి ఉంటే ఉత్తర తెలంగాణలో కరువు పరిస్థితులు ఇంత తీవ్రంగా ఉండేవి కావని అభిప్రాయపడ్డారు.
కాళేశ్వరం ప్రాజెక్టును సరైన పద్ధతిలో నిర్మించామనే నమ్మకం కేసీఆర్, కేటీఆర్‌లకు ఉంటే బ్యారేజీ దిగువన నిలబడి పంపులు ఆన్ చేయాలని ఎంపీ వంశీకృష్ణ బహిరంగ సవాల్ విసిరారు. NDSA భద్రతా సూచనల మేరకే బ్యారేజీలో నీటిని నిల్వ చేయడం లేదని, ప్రజల భద్రతే ప్రభుత్వానికి ముఖ్యమని స్పష్టం చేశారు. మరమ్మతులు పూర్తయ్యే వరకు బ్యారేజీని వినియోగించవద్దన్న సూచనలను పట్టించుకోకుండా పంపులు ఆన్ చేయాలని కోరడం ప్రజలను తప్పుదోవ పట్టించడమేనని అన్నారు.
బీఆర్ఎస్ పదేళ్ల పాలనలో నీళ్లు, నిధులు, నియామకాల పేరుతో అధికారంలోకి వచ్చి యువతకు ఎంతమేరకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పించారో సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. మరోవైపు మంత్రి గడ్డం వివేక్ వెంకటస్వామి ఆధ్వర్యంలో ఏటీసీ శిక్షణ కేంద్రాల ద్వారా సుమారు 20 వేల మందికి శిక్షణ అందించి ఉపాధి అవకాశాలు కల్పించే దిశగా ప్రభుత్వం కృషి చేస్తోందని, టామ్‌కామ్ ద్వారా సుమారు 10 వేల మంది తెలంగాణ యువతకు అంతర్జాతీయ స్థాయిలో ఉద్యోగ అవకాశాలు కల్పించేందుకు చర్యలు చేపడుతోందని తెలిపారు. ఎన్ని అడ్డంకులు ఎదురైనా పెద్దపల్లి పార్లమెంట్ నియోజకవర్గంలో అభివృద్ధి పనులను ఆపేది లేదని, ప్రజాసేవే లక్ష్యంగా ముందుకు సాగుతామని ఎంపీ వంశీకృష్ణ స్పష్టం చేశారు.

