కలం, మెదక్ బ్యూరో: రాష్ట్రంలో ప్రస్తుతం నెలకొన్న కరువు పరిస్థితులు కాలం తెచ్చినవి కావని, ప్రభుత్వ నిర్లక్ష్యం వల్ల వచ్చిన ‘కాంగ్రెస్ మార్క్’ కరువని మాజీ మంత్రి హరీశ్ రావు (Harish Rao) విమర్శించారు. కాగజ్ మద్దూర్ గ్రామంలో స్థానిక ఎమ్మెల్యే సునీతా లక్ష్మారెడ్డి సమక్షంలో పలువురు కాంగ్రెస్, బీజేపీ నాయకులు, కార్యకర్తలు శనివారం బీఆర్‌ఎస్ పార్టీలో చేరారు. ఈ సందర్భంగా హరీశ్ రావు మాట్లాడుతూ.. కాంగ్రెస్ పాలన, సీఎం రేవంత్ రెడ్డి వైఫల్యాలపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు.
అనుయాయుల కోసమే ఫ్యూచర్ సిటీ రోడ్లు
గ్రామాల్లో రోడ్ల గుంతలు పూడ్చడానికి నిధులు లేవని చెబుతున్న ప్రభుత్వం, మనుషులే లేని ఫ్యూచర్ సిటీ ప్రాంతంలో ఆరు వరుసల రోడ్ల కోసం రూ.10 వేల కోట్లు ఎలా కేటాయిస్తుందని హరీశ్ రావు ప్రశ్నించారు. మరోవైపు కళ్లెదుటే గోదావరి నీళ్లు పారుతున్నా మోటార్లు ఆన్ చేయకుండా పంటలను ఎండబెట్టి రైతుల ఉసురు పోసుకుంటున్నారని ఆరోపించారు. దేవుళ్లపై ఒట్లు పెట్టి రుణమాఫీ చేయకుండా రేవంత్ రెడ్డి రైతులను నట్టేట ముంచారని ఎద్దేవా చేశారు. ఎన్నికల ముందు ఇచ్చిన బాండ్ పేపర్లను బొందపెట్టి, ఆరు గ్యారెంటీలకు గోరీ కట్టారని మండిపడ్డారు.
ముందే హెచ్చరించినా పట్టించుకోలేదు..
వాతావరణ శాఖ ఆరు నెలల ముందే హెచ్చరించినా బొగ్గు నిల్వలు చేసుకోకుండా, ఇప్పుడు కరెంటు కోతలకు ఎల్‌నినో కారణమంటూ రేవంత్ రెడ్డి డ్రామాలు ఆడుతున్నారని హరీశ్ రావు విమర్శించారు. కరెంటు కోసం సబ్‌స్టేషన్ల ముందు ధర్నాలు, ఎరువుల కోసం కిలోమీటర్ల కొద్దీ క్యూ లైన్లు నిలబడే పాత రోజులను రేవంత్ ప్రభుత్వం మళ్లీ తిరిగి తీసుకొచ్చిందని ధ్వజమెత్తారు. ఈ కార్యక్రమంలో స్థానిక ప్రజాప్రతినిధులు, బీఆర్‌ఎస్ ముఖ్య నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

